మొదలైన ట్రాక్టర్ ర్యాలీ... బారికేడ్లను తెంచుకుని ముందుకు కదిలిన రైతులు!

26-01-2021 Tue 09:09
  • సింఘూ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత
  • మిగతా ప్రాంతాల్లో శాంతియుతంగా ర్యాలీ
  • జెండాలు అలంకరించిన ట్రాక్టర్లతో కదిలిన రైతులు
Tractor Rally of Farmers Started in Delhi

కేంద్రం గత సంవత్సరం తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, ఢిల్లీ సరిహద్దుల వద్ద నిరసనలు తెలియజేస్తున్న రైతులు, గణతంత్ర దినోత్సవం నాడు భారీ ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీకి ఢిల్లీ చుట్టుపక్కల మూడు మార్గాల్లో పోలీసులు అనుమతించగా, పలు చోట్ల రైతుల ట్రాక్టర్లు ముందుకు కదలకుండా బారికేడ్లను ఉంచడంతో, వాటిని తొలగించి మరీ ర్యాలీ ముందుకు కదిలింది. ముఖ్యంగా సింఘూ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 5 వేల మంది బారికేడ్లను విరగ్గొట్టి, తమ ర్యాలీని ముందుకు సాగించారు. దాదాపు రెండు లక్షల వరకూ ట్రాక్టర్లు ర్యాలీకి సిద్ధం కాగా, పోలీసులు 5 వేల ట్రాక్టర్లకు మాత్రమే అనుమతినిచ్చారు. దీంతో చాలా చోట్ల బందోబస్తులో ఉన్న పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారని తెలుస్తోంది.

పశ్చిమ ఢిల్లీలో రైతు ర్యాలీ ప్రశాంతంగా సాగుతున్నట్టు సమాచారం. నిరసనకారులు శాంతియుతంగా ఉండాలని రైతు నేతలు విజ్ఞప్తి చేయడం, ఆపై రైతు ప్రతినిధులు, పోలీసులు సమావేశమై చర్చలు జరిపిన తరువాత, ర్యాలీ మార్గంలో ఉన్న అవరోధాలను పోలీసులు తొలగించారు. ఈ ప్రాంతంలో సాధారణ ట్రాఫిక్ ను సైతం మళ్లించారు.

ఇక రైతులు, త్రివర్ణ పతాకాలతో అలంకరించిన తమ ట్రాక్టర్లతో పోలీసు బందోబస్తు మధ్య హస్తిన చుట్టూ ఉన్న రింగ్ రోడ్లపై తమ ప్రదర్శనను ప్రారంభించారు. ఇక ప్రతి ట్రాక్టర్ పైనా పోలీసులు కూడా కనిపిస్తుండటం గమనార్హం.