తెలంగాణలో ప్రైవేటు వైద్య సిబ్బందికి కరోనా టీకా.. నిన్న ఐదుగురికి రియాక్షన్

26-01-2021 Tue 08:46
  • నిన్న 495 కేంద్రాలలో 20,359 మందికి టీకా
  • నేడు, రేపు టీకా కార్యక్రమానికి విరామం
  • నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,30,607 వ్యాక్సినేషన్
Corona vaccination drive starts in private hospital staff in telangana

ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బందికి కూడా టీకా ఇచ్చే కార్యక్రమం నిన్నటి నుంచి తెలంగాణలో ప్రారంభమైంది. సోమవారం మొత్తం 495 కేంద్రాలలో 20,359 మందికి టీకా ఇచ్చారు. టీకా తీసుకున్న ఐదుగురిలో దుష్ప్రభావాలు కనిపించాయి. మిగతా వారంతా ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు టీకా కార్యక్రమం ఉండదని, తిరిగి గురువారం నుంచి యథావిధిగా టీకాలు వేస్తామని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు.

ప్రభుత్వ వైద్య సిబ్బందికి నిన్నటితో తొలి డోసు టీకా పంపిణీ పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. గర్భిణులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు టీకాకు దూరంగా ఉండగా, రాష్ట్రంలో 64 శాతం మంది టీకా తీసుకున్నట్టు తెలిపారు. నిన్నటి వరకు రాష్ట్రంలో 2,14,418 మందికి టీకా వేయాల్సి ఉండగా, 1,30,607 మంది అంటే 60 శాతం మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. ఇక ప్రైవేటు వైద్య సిబ్బందిలో తొలి రోజు 42,915 మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, సగం మంది కూడా టీకా వేయించుకోకపోవడం గమనార్హం.

నిన్న హైదరాబాద్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్టో ఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తొలి టీకా వేయించుకున్నారు. అలాగే, కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ భాస్కరరావు, సన్‌షైన్ ఆసుపత్రి ఎండీ గురువారెడ్డి వ్యాక్సిన్ వేయించుకున్నారు. యశోద ఆసుపత్రిలో సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీరావు, మెడికవర్ ఆసుపత్రి డైరెక్టర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్‌రెడ్డి టీకా తీసుకున్నారు. వీరితోపాటు కేర్, అపోలో ఆసుపత్రి వైద్యులు కూడా టీకా తీసుకున్న వారిలో ఉన్నారు.