సనత్ నగర్ లో రౌడీషీటర్ ఫిరోజ్ దారుణ హత్య!

26-01-2021 Tue 08:44
  • నిన్న రాత్రి హత్య
  • కళ్లల్లో కారం కొట్టి, కత్తులతో దాడి
  • చికిత్స పొందుతూ ఫిరోజ్ మృతి
Rowdy Sheeter Firoj Murdered in Hyderabad

హైదరాబాద్, సనత్ నగర్ లో నిన్న రాత్రి దారుణ హత్య జరిగింది. ఇక్కడి ఆర్కో సొసైటీలో ఉంటున్న రౌడీ షీటర్ ఫిరోజ్ ను కొందరు ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి చంపేశారు. వారి మధ్య ఉన్న పాతకక్షలే ఇందుకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

 దుండగుల దాడిలో ఫిరోజ్ కు తీవ్ర గాయాలు కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు, అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఫిరోజ్ ను చుట్టుముట్టి కళ్లల్లో కారం కొట్టిన నిందితులు, ఆపై కత్తులతో విచక్షణారహితంగా పొడిచారని వెల్లడించిన పోలీసులు, అతనిపై సనత్ నగర్ తో పాటు ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లలో కబ్జా ఆరోపణలతో పాటు చాలా కేసులు ఉన్నాయని తెలిపారు. హత్యకు పాతకక్షలే కారణమా? లేక ఇంకేదైనా కోణం ఉందా? అన్న కోణంలో కేసును దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.