ప్రియుడికి ఎయిడ్స్ అని తెలిసి కూడా పెళ్లాడిన మైనర్!

26-01-2021 Tue 08:24
  • తమిళనాడులో ఘటన
  • డిగ్రీ తొలి సంవత్సరం చదువుతున్న బాలిక
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు
Minor Marriage With Lover How Having AIDS

ఎయిడ్స్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో తెలిసి కూడా ఓ మైనర్ బాలిక తన ప్రియుడిని పెళ్లాడిన ఘటన తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో జరిగింది. ఆపై ఆమెకు కూడా హెచ్ఐవీ సోకిందేమోనన్న అనుమానంతో పోలీసులు పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, నాగర్ కోయిల్ లో ప్రైవేటు కాలేజీలో డిగ్రీ తొలి సంవత్సరం చదువుతున్న ఓ బాలిక (17) రెండు రోజులుగా కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రుల నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఆపై రంగంలోకి దిగిన పోలీసులు, ఆమె 22 ఏళ్ల ఆటో డ్రైవర్ తో ప్రేమలో ఉన్నట్టు తమ విచారణలో గుర్తించారు. ఇద్దరూ కలిసి కోవైలోని స్నేహితుల వద్దకు వెళ్లారని, అక్కడే వివాహం చేసుకున్నారని తేల్చారు. సదరు ఆటో డ్రైవర్ కు హెచ్ఐవీ ఉందని తెలిసి కూడా ఆమె వివాహానికి అంగీకరించిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

అయితే, ఆమెకు ఇంకా మైనారిటీ తీరకపోవడంతో ఆటో డ్రైవర్ పై పోక్సో చట్టం కింద కేసును రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశామని, తాము వారి వద్దకు వెళ్లిన సమయంలో భర్త అరెస్ట్ ను అడ్డుకున్న బాలిక, రోడ్డుపై బైఠాయించి, తనను కూడా తీసుకెళ్లాలని గొడవ చేసిందని తెలిపారు. ప్రస్తుతం ఆమెను ప్రభుత్వాసుపత్రిలో మరిన్ని పరీక్షల నిమిత్తం చేర్చామని, కేసును విచారించి, తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.