అధికార పార్టీని సర్వనాశనం చేసే వరకు వారు విశ్రమించరు: శరద్ పవార్

26-01-2021 Tue 08:14
  • నిన్న ముంబైలోని ఆజాద్ మైదానంలో రైతుల భారీ ర్యాలీ
  • కేంద్రంపై నిప్పులు చెరిగిన శరద్ పవార్
  • పబ్లిసిటీ స్టంట్ అన్న బీజేపీ
 They will not rest until the ruling party is annihilated says Sharad Pawar

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిన్న ముంబైలోని ఆజాద్ మైదానంలో వేలాదిమంది రైతులు ర్యాలీ, భారీ బహిరంగ సభ నిర్వహించారు.

ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. రాజ్యాంగాన్ని కాలరాసి ఎలాంటి చట్టాలనైనా తీసుకురావొచ్చని, కానీ రైతులు, సామాన్యులకు ఆగ్రహం వచ్చి ఉద్యమిస్తే  ప్రభుత్వ పతనం తప్పదని అన్నారు.

వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతుల్లో తీవ్ర అభద్రతా భావాన్ని నింపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకున్నా, తీసుకోకపోయినా ఆ చట్టాలను, అధికార పార్టీని సర్వనాశనం చేసేంత వరకు రైతులు విశ్రమించబోరని హెచ్చరించారు.

 మరోవైపు, ముంబైలో నిర్వహించిన రైతుల ధర్నాపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ముంబైలో జరిగిన రైతుల ధర్నా ఓ పబ్లిసిటీ స్టంట్ అని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే విమర్శించగా, రైతుల ఆందోళనను అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు డ్రామాలాడుతున్నాయని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు.