సూర్యాపేట కల్నల్ సంతోష్‌‌బాబుకు మహావీరచక్ర.. ప్రకటించిన ప్రభుత్వం

26-01-2021 Tue 07:06
  • గతేడాది జూన్ 15న గల్వాన్ లోయలో దురాక్రమణకు చైనా యత్నం
  • తీవ్రంగా ప్రతిఘటించిన భారత సైన్యం
  • చైనా సైనికుల దాడిలో సంతోష్‌బాబు వీరమరణం
  • మరణానంతరం ‘మహావీరచక్ర’ను ప్రకటించిన ప్రభుత్వం
Indian govt announce Mahaveer Chakra to Colonel Santosh Babu

గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్‌బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీరచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు గతేడాది గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడయ్యాడు. డ్రాగన్ సేనలతో వీరోచితంగా పోరాడిన సంతోష్‌బాబు వారి దాడిలో వీరమరణం పొందాడు. సంతోష్‌బాబు ఈ దేశానికి అందించిన సేవలకు గౌరవంగా ప్రభుత్వం మరణానంతరం మహావీరచక్ర పురస్కారాన్ని ప్రకటించింది.

సంతోష్‌బాబు బీహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారిగా వ్యవహరించేవారు. గతేడాది జూన్ 15న గల్వాన్ లోయ వద్ద చైనా దురాక్రమణకు ప్రయత్నించింది. భారత సేనలు దీనిని తీవ్రంగా ప్రతిఘటించాయి. వారిని దీటుగా ఎదుర్కొని తిప్పికొట్టాయి. ఈ దాడిలో భారత్‌కు చెందిన 21 మంది జవాన్లు అమరులయ్యారు. వీరిలో కల్నల్ సంతోష్‌బాబు ఒకరు. అలాగే, భారత సైనికుల దాడిలో చైనా వైపు కూడా భారీ ప్రాణనష్టం జరిగింది.