ఆలయాలపై టీడీపీ దాడులను పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తాం: విజయసాయిరెడ్డి

25-01-2021 Mon 21:44
  • మరికొన్నిరోజుల్లో పార్లమెంటు సమావేశాలు
  • వైసీపీ ఎంపీలతో సీఎం జగన్ భేటీ
  • భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి
  • విగ్రహాల ధ్వంసంలో చంద్రబాబు ప్రమేయం ఉందని వెల్లడి
Vijayasai Reddy opines on Parliament budget sessions

త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం జగన్ వైసీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఆలయాలపై టీడీపీ దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనల్లో చంద్రబాబు ప్రమేయం ఉందనడానికి ఆధారాలు ఉన్నాయని, ఈ దాడి ఘటనలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు.

ఆలయాలపై దాడుల పట్ల పార్లమెంటుకు వివరిస్తామని అన్నారు. ఇవేకాకుండా, పోలవరం నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, విశాఖ రైల్వే జోన్, నివర్ తుపాను నిధుల విడుదల అంశాలను కూడా పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని విజయసాయి వివరించారు.