రామ్ చరణ్ తో జతకట్టనున్న పూజ హెగ్డే!

25-01-2021 Mon 21:43
  • చిరంజీవి, కొరటాల కలయికలో 'ఆచార్య' 
  • ప్రత్యేక పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్
  • చరణ్ కి జంటగా తాజాగా పూజ ఎంపిక 
  • వేసవిలో ప్రేక్షకుల ముందుకు సినిమా  
Pooja Hegde gives nod to pair up with Ram Charan

తెలుగు, హిందీ సినిమాలతో బిజీబిజీగా వున్న అందాల బుట్టబొమ్మ పూజ హెగ్డే ఇప్పుడు హీరో రామ్ చరణ్ సరసన జతకట్టడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే తను ఈ చిత్రం షూటింగులో జాయిన్ అయ్యాడు కూడా.

ఇక ఇందులో చరణ్ సరసన నటించే కథానాయిక విషయంలో మొదటి నుంచీ రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. రష్మిక మందన్న దాదాపు ఫైనల్ అయినట్టుగా కూడా ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే, ఆమె డేట్స్ సమస్య కారణంగా సారీ చెప్పిందట. ఈ క్రమంలో తాజాగా పూజ హెగ్డేను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. త్వరలో ఆమె షూటింగులో పాల్గొంటుందని, వచ్చే నెలాఖరుకి చరణ్, పూజ షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం.

ఈ 'ఆచార్య' సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. వచ్చే వేసవిలో ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.