త్వరలోనే కాపు సంక్షేమ సేన నేతలతో సమావేశం ఉంటుంది: పవన్ కల్యాణ్

25-01-2021 Mon 21:31
  • హరిరామజోగయ్య తనకు లేఖ రాశారన్న పవన్
  • కాపు సమస్యలు ప్రస్తావించారని వెల్లడి
  • కాపు ప్రతినిధులతో సమావేశమవ్వాలని సూచించారని వివరణ
  • తప్పకుండా సమావేశమవుతానని స్పష్టీకరణ
Pawan says he will meet Kapu Sankshema Sena leaders

కాపు సామాజిక వర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలోనే కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ అవుతున్నట్టు జనసేనాని పవన్ కల్యాణ్ వెల్లడించారు. కాపు కులస్తుల సమస్యలు, కాపు రిజర్వేషన్ అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో చర్చించాలంటూ కాపు సంక్షేమ సేన జేఏసీ అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య కోరారని పవన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారని పేర్కొన్నారు. కాపుల రిజర్వేషన్, కాపు కార్పొరేషన్ నిధుల వినియోగంలో ఆ సామాజిక వర్గానికి ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కాకపోవడం వంటి అంశాలను హరిరామజోగయ్య ప్రస్తావించారని, ఆయన విజ్ఞప్తి మేరకు కాపు సంక్షేమ సేన ప్రతినిధులను కలుస్తానని పవన్ వెల్లడించారు.

దేశ ప్రజలందరికీ 72వ రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

రేపు భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలైన పర్వదినమని పేర్కొన్నారు. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రరాజ్యంగా ఏర్పడడం వెనుక ఎందరో ఆత్మబలిదానాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన చరిత్రను యువతీయువకులు తెలుసుకోవాలని సూచించారు. వారు అందించిన విలువను పాటించాలని పిలుపునిచ్చారు.