GVL Narasimha Rao: వైసీపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి మొట్టికాయలు వేయించుకుంది: జీవీఎల్

YSRCP govt has to work under constitution says GVL
  • పంచాయతీ ఎన్నికలపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం
  • జగన్ గారూ రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాల్సిందే
  • ఆరోపణలకు తావివ్వకుండా ఎస్ఈసీ పని చేయాలి

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్ ను సాకుగా చూపుతూ ఎన్నికలను అడ్డుకోవాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. దేశంలో అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నప్పుడు... ఏపీలో మాత్రమే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది.

ఎస్ఈసీపై మీ ధోరణే మీ అభిప్రాయాలను, ఆలోచనా తీరును తేటతెల్లం చేస్తోందని  రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగ సంఘాల నేతలపై కూడా మండిపడింది. ఎన్జీవోలు చట్టానికి వ్యతిరేకమనే భావన కనిపిస్తోందని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. సుప్రీం తీర్పును ఆయన స్వాగతించారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికలు యథాతథంగా జరగాలన్న సుప్రీం ఆదేశాలు రాజ్యాంగ వ్యవస్థను కాపాడేలా ఉన్నాయని జీవీఎల్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అనేక విషయాల్లో మొండి వైఖరితో వ్యవహరించి మొట్టికాయలు వేయించుకుందని చెప్పారు. 'ఎన్నికల్లో ఎంత మెజార్టీతో గెలిచినా రాజ్యాంగ వ్యవస్థకు అనుగుణంగా పని చేయాల్సిందే జగన్ గారూ' అని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ హోదాను గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా మంచి తీర్పు అని జీవీఎల్ అన్నారు. గతంలో రాజకీయ ఆరోపణలను ఎదుర్కొన్న ఎస్ఈసీ రమేశ్ కుమార్ అటువంటి ఆరోపణలకు తావివ్వకుండా పని చేయాలని కోరారు. ఈ రాజ్యాంగ వ్యవస్థ విలువలను పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం, నిమ్మగడ్డ రమేశ్ ఇద్దరూ మసలుకోవాలని సూచించారు. 

  • Loading...

More Telugu News