Mumbai: రైతుల ఉద్యమానికి మద్దతుగా ముంబైలో నేడు భారీ ర్యాలీ.. నాసిక్ నుంచి కదిలివచ్చిన వేలాదిమంది రైతులు

Thousands of farmers reached Mumbai to protest new agriculture laws
  • మహారాష్ట్రలోని 21 జిల్లాల నుంచి తరలివచ్చిన రైతులు
  • నేటి సాయంత్రం ఆజాద్ మైదాన్ లో భారీ ర్యాలీ
  • హాజరుకానున్న ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన మహారాష్ట్రలోని 21 జిల్లాల రైతులు మొన్న (శనివారం) నాసిక్‌లో కలుసుకున్నారు.

అక్కడి నుంచి 180 కిలోమీటర్ల దూరంలోని ముంబైకి ర్యాలీగా బయలుదేరారు. ‘ఆల్ ఇండియా  కిసాన్’ సభ పేరుతో ఒక్కటైన రైతులు వేలాదిమంది జెండాలు, బ్యానర్లతో నాసిక్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. నిన్న సాయంత్రం ముంబై చేరుకున్నారు. నేడు ఆజాద్ మైదానంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ హాజరవుతారు.  

మరోవైపు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలో రైతులు నిర్వహించనున్న ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి లభించింది. ఇందుకోసం వందలాదిమంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దుకు చేరుకుంటున్నారు. గణతంత్ర వేడుకల తర్వాత రైతుల ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభం అవుతుంది. ప్రతి ట్రాక్టర్‌పై జాతీయ జెండా ఉంటుంది. రైతులు ఆందోళన చేస్తున్న సింఘు, టిక్రి, ఘాజీపూర్, పల్వాల్, షాజహాన్‌పూర్ సరిహద్దుల నుంచి ట్రాక్టర్ ర్యాలీ మొదలవుతుంది. అవుటర్ రింగు రోడ్డులో 100 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం సాయంత్రం ర్యాలీ ముగుస్తుంది.
Mumbai
Farm Laws
Farmers protest

More Telugu News