New Delhi: రైతు ర్యాలీని హింసాత్మకం చేసేందుకు పాక్ పన్నాగాలు!

  • 'సపోర్ట్ ఖలిస్థాన్' పేరిట హ్యాష్ ట్యాగ్
  • ర్యాలీని హైజాక్ చేస్తున్న పాకిస్థాన్
  • వెల్లడించిన ఢిల్లీ స్పెషల్ కమిషనర్
Pak Conspirasy in Farmers Tractor Rally

ఢిల్లీలో రేపు జరగనున్న రైతు ర్యాలీని హింసాత్మకం చేసేందుకు పాకిస్థాన్ కు చెందిన ట్విట్టర్ హ్యాండ్లర్స్ రంగంలోకి దిగారని ఢిల్లీ పోలీసు వర్గాలు గుర్తించాయి. ర్యాలీని హైజాక్ చేసేందుకు వీరు ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ ఇంటెలిజెన్స్ విభాగం స్పెషల్ కమిషనర్ దీపేంద్ర పాథక్ వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు అడ్డంకులు కల్పించడమే వారి ఉద్దేశమని అన్నారు.

"మొత్తం 300కు పైగా ట్విట్టర్ ఖాతాలను గుర్తించాం. ఇవన్నీ పాకిస్థాన్ లో పుట్టినవే. జనవరి 13 నుంచి 18 మధ్య ఇవి యాక్టివ్ అయ్యాయి. ప్రజలను, ముఖ్యంగా రైతులను తప్పుదారి పట్టించడమే వీరి లక్ష్యం. ఈ ర్యాలీ శాంతియుతంగా జరిగేలా చూడటం మా ముందున్న పెద్ద సవాలే" అని ఆయన అన్నారు.

ఇక, పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఆపరేట్ అవుతున్న ఈ ట్విట్టర్ ఖాతాలు 'సపోర్ట్ ఖలిస్థాన్' హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నాయని, కొన్ని ఖాతాలు విభిన్న దేశాల నుంచి నడుస్తున్నాయని కూడా గుర్తించామని ఆయన అన్నారు. పాక్ అధికారిక రేడియో చానెల్ కూడా ఈ హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తోందని దీపేంద్ర తెలిపారు. పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ సెక్రెటరీ జనరల్, పాకిస్థాన్ సెనెట్ కార్యదర్శి ఖుర్రమ్ నవాజ్ గండాపూర్, ప్రముఖ జర్నలిస్ట్ మొహమ్మద్ షఫీక్ తదితరులు దీన్ని వాడుతూ ట్వీట్లు పెడుతున్నారని తెలిపారు.

"పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న టెర్రరిస్ట్ గ్రూపులకు మన దేశంలో సమస్యలు సృష్టించడమే లక్ష్యం. విధ్వంసం సృష్టించడం ద్వారా శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా చూసేందుకు వీరంతా ప్రయత్నిస్తున్నారు. రైతుల నిరసనలను, ట్రాక్టర్ ర్యాలీకి సంబంధం ఉండే హ్యాష్ ట్యాగ్ లను ప్రమోట్ చేస్తున్నారు" అని ఆయన అన్నారు. రైతులు తప్పుడు సమాచారాన్ని నమ్మరాదని సూచించారు.

More Telugu News