షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారంటూ మీడియాలో కథనాలు... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

24-01-2021 Sun 19:21
  • అభిప్రాయాలు తెలిపిన పొన్నాల, వీహెచ్
  • షర్మిల పార్టీ ప్రజావసరమో, కాదో తెలియదన్న పొన్నాల
  • ఆలూ లేదు చూలూ లేదు అంటూ వ్యాఖ్యలు
  • షర్మిలకు జగన్ అన్యాయం చేశాడన్న వీహెచ్
  • షర్మిల ఏపీలోనే పార్టీ పెట్టాలని సూచన
Telangana Congress leaders opines on alleged new party of Sharmila

దివంగత వైఎస్సార్ తనయ, ఏపీ సీఎం జగన్ సహోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ప్రారంభిస్తున్నారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు స్పందించారు. షర్మిల పార్టీ ప్రజావసరమో, కాదో తెలియదని పొన్నాల అన్నారు. షర్మిల కొత్త పార్టీ వ్యవహారం ఆలూ లేదు చూలూ లేదు అనే సామెత చందంగా ఉందని వ్యాఖ్యానించారు.

అటు, వీహెచ్ వ్యాఖ్యానిస్తూ, షర్మిలలో ప్రవహించేది కూడా వైఎస్ రక్తమేనని, అందుకే ఆమె పార్టీ ఆలోచన చేస్తున్నట్టుందని అభిప్రాయపడ్డారు. విశాఖ టికెట్ ఇవ్వకుండా షర్మిలకు జగన్ అన్యాయం చేశాడని ఆరోపించారు. అయితే, షర్మిల కొత్త పార్టీని ఏపీలో స్థాపించడం మేలని, తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడం వల్ల ఏమంత ప్రయోజనం ఉండబోదని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని.. ఏపీలో పార్టీ ప్రారంభిస్తే జగన్ వ్యతిరేకులు ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని వీహెచ్ విశ్లేషించారు. ఒకవేళ జగన్ పై ప్రతీకారంతోనే పార్టీ పెట్టదలచుకుంటే అందుకు ఏపీనే అనువైన ప్రాంతం అని పేర్కొన్నారు.