చైనా, తైవాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించిన అమెరికా విమాన వాహక నౌకలు

24-01-2021 Sun 18:59
  • తైవాన్, చైనా మధ్య మళ్లీ స్పర్ధలు
  • తైవాన్ గగనతలంపై చైనా యుద్ధ విమానాలు
  • అదే రోజు దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా యుద్ధనౌకలు
  • సాధారణ కార్యకలాపాల్లో భాగంగానే అంటున్న అమెరికా
US aircraft carriers fleet enters South China sea

మరోసారి తైవాన్, చైనా మధ్య స్పర్ధలు భగ్గుమన్న నేపథ్యంలో అమెరికా విమాన వాహక నౌకలు దక్షిణ చైనా సముద్రంలో అడుగుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యంత భారీ విమాన వాహక నౌక యూఎస్ఎస్ థియొడోర్ రూజ్ వెల్ట్ నేతృత్వంలో పలు విమాన వాహక నౌకలు పసిఫిక్ మహాసముద్రం నుంచి దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించాయి.

'ఫ్రీడమ్ ఆఫ్ ద సీస్' కార్యాచరణను మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగానే తమ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు దక్షిణ చైనా సముద్రంలోకి వెళ్లాయని అమెరికా సైన్యం చెబుతోంది. సాధారణ కార్యకలాపాల్లో భాగంగానే తమ నౌకలు దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశించాయని, భాగస్వామ్యాలను మరింత పటిష్టం చేసుకోవడానికి, సముద్ర గస్తీని మరింత పటుతరం చేసుకోవడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని ఉద్ఘాటించాయి.

అయితే, చైనా యుద్ధ విమానాలు పెద్ద సంఖ్యలో తమ గగనతలంపై దూసుకెళ్లాయని తైవాన్ ఆరోపించిన రోజే అమెరికా యుద్ధ నౌకలు రావడం గమనార్హం.  కాగా, డొనాల్డ్ ట్రంప్ తరహాలోనే జో బైడెన్ ప్రభుత్వం కూడా చైనాను అమెరికాకు అతి పెద్ద ముప్పుగా పరిగణిస్తోంది. అమెరికా మంత్రిగా బైడెన్ నామినేట్ చేసిన ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, ఏ ఇతర దేశం కన్నా చైనానే అమెరికాకు అతిపెద్ద సవాలు అనడంలో సందేహం లేదని అన్నారు.

గతకొంతకాలంగా దక్షిణ చైనా సముద్రంలో ఉన్న నిర్మానుష్య దీవుల్లో పాగా వేసేందుకు చైనా ప్రయత్నిస్తోందంటూ పొరుగు సమీప దేశాలపై మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రూనై, తైవాన్, వియత్నామ్ ఆరోపిస్తున్నాయి. పైగా ఈ ప్రాంతంలో కృత్రిమంగా ద్వీపాలు నిర్మిస్తూ ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. దాంతో చైనా పొరుగుదేశాలకు మద్దతుగా అమెరికా తన యుద్ధ నౌకల శ్రేణిని తరచుగా దక్షిణ చైనా సముద్రంలోకి తరలిస్తోంది. ఈ చర్యలు చైనా దూకుడును అదుపులో ఉంచుతాయని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.