ఎక్కడో ఉన్న సోనూ సూద్ చూపిస్తున్నంత చొరవ కూడా ఏపీ ప్రభుత్వం చూపించడంలేదు: సోమిరెడ్డి

24-01-2021 Sun 17:27
  • ఏపీలో ఓ పసికందు గుండె ఆపరేషన్ కు సోనూ సూద్ సాయం
  • రూ.6 లక్షల అందజేత
  • సోనూ సూద్ ను అభినందించిన సోమిరెడ్డి
  • సోనూ సూద్ స్పందించేదాకా ఏపీ సర్కారు ఏంచేస్తోందంటూ ట్వీట్
Somireddy lauds Sonu Sood for his help to a needy child

పశ్చిమ గోదాదవరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన వెంకటేశ్వరరావు, దేవి దంపతుల 8 నెలల చిన్నారికి గుండెలో సమస్య రాగా, సినీ నటుడు సోనూ సూద్ శస్త్రచికిత్స కోసం రూ.6 లక్షల సాయం చేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఎక్కడో ముంబయిలో ఉండే సోనూ సూద్ ఈ విషయంపై స్పందించే దాకా ఏపీ ప్రభుత్వం ఏంచేస్తోందని ప్రశ్నించారు. సోనూ సూద్ చూపినంత చొరవను కూడా ఏపీ ప్రభుత్వం చూపించకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. పసిబిడ్డ గుండె సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకుని రూ.6 లక్షలిచ్చి శస్త్రచికిత్స చేయించడం అభినందనీయం అని తెలిపారు.

కష్టకాలంలో పేదలకు అండగా నిలిచే సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) ను పూర్తిగా నిర్వీర్యం చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు అతీతంగా కష్టాల్లో ఉన్నామని ఎవరు ముందుకొచ్చినా ప్రతి ఒక్కరికీ వైద్య ఖర్చుల కోసం సాయం చేశామని వెల్లడించారు. జగన్ వచ్చాక సీఎంఆర్ఎఫ్ సాయం నిలిపివేశారని, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు.