శ్రీకృష్ణుడిపై మూఢభక్తితో ఆరో ఫ్లోర్ నుంచి దూకేసిన రష్యన్ మహిళ

24-01-2021 Sun 17:11
  • బృందావన్ లో విషాదం
  • శ్రీకృష్ణుడ్ని కలుసుకోవాలని భావించిన విదేశీ మహిళ
  • గతేడాది నుంచి భారత్ లో నివాసం
  • కృష్ణుడిపై వెర్రి ఆరాధనతో తిరిగిరాని లోకాలకు పయనం
Russian woman jumps off to death in Vrindavan

ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీకృష్ణుడ్ని కలుసుకోవాలన్న మూఢభక్తితో ఓ రష్యన్ మహిళ అపార్ట్ మెంట్ ఆరో ఫ్లోర్ నుంచి దూకేసి ప్రాణాలు వదిలింది. మృతురాలిని తాత్యానా హెమెలోవ్ స్కయా (41)గా గుర్తించారు. ఆమె గతేడాది ఫిబ్రవరి నుంచి బృందావన్ ధామ్ అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది.

దీనిపై జిల్లా ఎస్పీ ఎంపీ సింగ్ మాట్లాడుతూ, ఆ అపార్ట్ మెంట్ ఆరో ఫ్లోర్ లో రష్యా మహిళ ఒంటరిగా ఉంటోందని వెల్లడించారు. ఆమె స్వస్థలం రష్యాలోని రోస్తోవ్ నగరం అని తెలిపారు. శ్రీకృష్ణుఢి భక్తురాలైన ఆ రష్యన్ మహిళ టూరిస్టు వీసాపై భారత్ వచ్చినట్టు పేర్కొన్నారు.

కాగా తాత్యానా స్నేహితులు కూడా ఇదే అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. పోలీసులు వారిని విచారించగా, తాను శ్రీకృష్ణుడ్ని కలుసుకోవాలనుకుంటున్నట్టు చెప్పేదని తెలిసింది. తాత్యానా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు, ఆమె మృతి విషయాన్ని రష్యా దౌత్య కార్యాలయానికి తెలియజేశారు.