నేను రాజీనామా చేసి వస్తా... ప్రచారానికి జగన్ కూడా రారు... తేల్చుకుందాం రా!: పవన్ కల్యాణ్ కు అన్నా రాంబాబు సవాల్

24-01-2021 Sun 16:32
  • జనసైనికుడు వెంగయ్యనాయుడు ఆత్మహత్య
  • అన్నా రాంబాబే కారణమంటూ పవన్ ఆరోపణ
  • పవన్, అన్నా రాంబాబు మధ్య మాటల యుద్ధం
  • ప్రజాతీర్పు కోరదాం అంటూ అన్నా వ్యాఖ్యలు
Anna Ramababu challenges Pawan Kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సవాల్ విసిరారు. జనసేన కార్యకర్త వెంగయ్యనాయుడు ఆత్మహత్యకు తానే కారణమని ఆరోపిస్తున్న పవన్ కల్యాణ్ అందుకు ఆధారాలు చూపించగలరా? అని ప్రశ్నించారు. తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వబోమని పవన్ అంటున్నారని, తానే రాజీనామా చేసి వస్తానని, చూసుకుందాం రా అంటూ అన్నా రాంబాబు సవాల్ విసిరారు.

"బై ఎలక్షన్ వస్తే మా నాయకుడు జగన్ కూడా ప్రచారానికి రారు... ఆయన ఫొటో, దివంగత వైఎస్సార్ ఫొటో పెట్టుకుని నేనే ప్రచారం చేసుకుంటా. గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజాతీర్పు కోరదాం... తద్వారా తేల్చుకుందాం!" అని వ్యాఖ్యానించారు. ఒకవేళ పవన్ గెలిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని, ఒకవేళ ఆయన ఓడితే జనసేన పార్టీని మూసేస్తారా అని అన్నా రాంబాబు అడిగారు.

వెంగయ్యనాయుడుతో తనకు ఎలాంటి వివాదం లేదని, పవన్ కల్యాణ్ శవరాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. వెంగయ్యతో వివాదం వీడియోలను ఎడిటింగ్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.