Chandrababu: జీవో నెం.77పై ఆందోళన తెలిపిన టీఎన్ఎస్ఎఫ్ నేతలపై అత్యాచార కేసు నమోదు చేస్తారా?: చంద్రబాబు

  • జీవో నెం.77ని రద్దు చేయాలంటూ సీఎం నివాసం ముట్టడి
  • టీఎన్ఎస్ఎఫ్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
  • అత్యాచారయత్నం అంటూ కేసు నమోదు
  • మండిపడ్డ చంద్రబాబు
  • యువతపై ఇలాంటి కేసులా అని నిలదీసిన వైనం
Chandrababu alleges police registered rape case on students

జీవో నెం.77ని రద్దు చేయాలన్న డిమాండుతో టీఎన్ఎస్ఎఫ్ నేతలు తాడేపల్లిలో సీఎం జగన్ ఇంటిని ముట్టడించిన సంగతి తెలిసిందే. దాంతో పోలీసులు టీఎన్ఎస్ఎఫ్ నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాటిలో అత్యాచారయత్నం సెక్షన్ కూడా ఉండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెం.77కి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై ఏపీ సీఎం ఆజ్ఞలతో పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారని ఆరోపించారు.

ఇలాంటి కఠిన చట్టాన్ని విద్యార్థులపై మోపి వాళ్ల భవిష్యత్ ను అగమ్యగోచరంగా మార్చే ప్రయత్నం చేశారని, విద్యార్థి లోకం తరఫున పోరాడడమే వాళ్లు చేసిన తప్పా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి కేసులు నమోదు చేయడం ద్వారా ఏపీ యువతకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారు? అంటూ నిలదీశారు. ఏదేమైనా ఇది సిగ్గుచేటు అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

కాగా, అరెస్ట్ చేసిన విద్యార్థి నేతలను మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో హాజరుపరిచిన పోలీసులకు అక్షింతలు పడ్డాయి. పోలీసులు సమర్పించిన రిమాండు రిపోర్టులో అత్యాచారయత్నం కేసు అని ఉండడాన్ని గమనించిన జడ్జి ఆశ్చర్యపోయారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లలో అత్యాచారయత్నానికి సంబంధించినవేవీ లేవని, మరి సీఎం నివాసం ముట్టడి అత్యాచార యత్నం ఎలా అవుతుందని జడ్జి ప్రశ్నించడంతో పోలీసులు కంగుతిన్నారు.

అయితే, పొరపాటున ఆ పదం వచ్చిందంటూ కోర్టుకు తెలిపిన పోలీసులు, మరోసారి రిమాండు రిపోర్టు తయారుచేసి సమర్పించారు. దాంతో అరెస్టయిన వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు ఇచ్చారు.

More Telugu News