ర‌ష్యాలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు.. 3 వేల మంది అరెస్టు

24-01-2021 Sun 12:30
  • అలెక్సీ నావల్నీ అరెస్టు ప‌ట్ల నిర‌స‌న‌లు
  • ఆయ‌న‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్
  • ప‌లు న‌గ‌రాల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం
  • ప‌లువురికి తీవ్ర‌గాయాలు
More than 3000 detained in protests across Russia

జ‌ర్మ‌నీ రాజ‌ధాని బెర్లిన్ నుంచి మాస్కోలోని షెరెమెటివో విమానాశ్రయంలో అడుగు పెట్ట‌గానే ర‌ష్యా విప‌క్ష నేత అలెక్సీ నావల్నీని ఇటీవ‌ల‌ పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన అలెక్సీని అరెస్టు చేయ‌డం ప‌ట్ల ర‌ష్యాలో ప్ర‌జ‌లు చేస్తోన్న‌ ఆందోళ‌న‌ల్లో ఉద్రిక ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

యాంటీ కరప్షన్ ఫౌండేషన్‌ను స్థాపించి పోరాడుతోన్న‌ అలెక్సీ నావల్నీపై ర‌ష్యా ప్ర‌భుత్వం నిధుల దుర్వినియోగం ఆరోప‌ణ‌లు చేస్తూ అరెస్టు చేయ‌డం స‌రికాదంటూ ప్ర‌జ‌లు నిర‌స‌న తెలుపుతున్నారు.  అలెక్సీ నావల్నీని విడుదల చేయాలంటూ రష్యాలోని ప్రధాన నగరాల్లో ఆందోళ‌న‌లు చోటు చేసుకుంటున్నాయి.

ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసన ర్యాలీలు చేపట్ట‌డంతో ఆ నిర‌స‌న‌ల‌ను అణ‌చివేసేందుకు ర‌ష్యా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. మీడియాతో మాట్లాడుతున్న హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌నూ పోలీసులు లాక్కెళ్లిపోతున్నారు. అయిన‌ప్ప‌టికీ  చలిని కూడా లెక్క చేయకుండా వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

ప‌లు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులూ ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. అనేక  ప్రాంతాల్లో  నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. ప‌లువురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. మాస్సోతో పాటు మొత్తం 90 నగరాల్లో దాదాపు 3 వేల‌ మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు, నావల్నీ భార్య యూలియాను కూడా పోలీసులు అరెస్టు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ చ‌ర్య‌ల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించే అలెక్సీ నావల్నీపై ప్ర‌భుత్వం కావాల‌నే కుట్ర‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. కాగా, గ‌త ఏడాది ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు ప్ర‌చారం జ‌రిగిన‌ విషయం తెలిసిందే.

ఆయన అప్ప‌ట్లో విమానంలో ప్రయాణిస్తుండగా అనారోగ్యానికి గురయ్యారు.  విమానంలో ఆయ‌న‌కు ఇచ్చిన టీలో ఏదో కలిపి ఉంటారని అప్ప‌ట్లో ఆయన మ‌ద్ద‌తుదారులు ఆందోళ‌న వ్యక్తంచేశారు. అనంత‌రం ఆయ‌న కోమాలోకి వెళ్లిపోవ‌డంతో  ఆయ‌న విష ప్రయోగానికి గురైనట్లుగా తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

అనంత‌రం ఆయ‌న‌ను చికిత్స కోసం జర్మనీకి తరలించారు. కొన్ని నెల‌ల పాటు అక్క‌డే ఉన్న నావెల్నీ ఓ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నప్ప‌టికీ ర‌ష్యాకు రాలేదు. కొన్ని నెల‌లు అక్క‌డే ఉండి ఇటీవ‌లే ర‌ష్యాకు వ‌చ్చారు.  ఆయ‌న ర‌ష్యాకు వ‌స్తే అరెస్టు చేస్తామ‌ని అంత‌కు ముందే ప్ర‌క‌టించిన‌ ర‌ష్యా ప్ర‌భుత్వం అన్నంత‌ ప‌ని చేసింది.

 ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆందోళ‌న‌కారులు సామాజిక మాధ్య‌మాల్లో త‌మ ఆందోళ‌న‌ల గురించి ప్ర‌చారం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపి వేయడం గ‌మ‌నార్హం. టిక్‌టాక్‌లోనూ ఆందోళ‌న‌కారులు పెద్ద ఎత్తున వీడియోల‌ను పోస్ట్ చేస్తున్నారు. నావెల్నీకి స్వేచ్ఛ‌ను క‌ల్పించాల‌ని అంటున్నారు. ర‌ష్యా తీసుకుంటోన్న చ‌ర్య‌ల‌పై అమెరికా స‌హా ప‌లు దేశాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. నావెల్నీని వెంట‌నే విడిచి పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.