కర్ణాటకలో అక్రమ రాళ్ల క్వారీలు 2 వేలకుపైనే!: గనుల శాఖ అధికారులు

24-01-2021 Sun 12:12
  • లైసెన్స్ తో నడుస్తున్నవి కేవలం 750
  • బెంగళూరులోనూ చాలా అక్రమ క్వారీలు
  • సున్నితమైన ప్రాంతాలకు కిలోమీటర్ పరిధిలోనే నిర్వహణ
2000 illegal quarries active in Karnataka

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో రెండ్రోజుల క్రితం జరిగిన పేలుడు ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. లారీ లోడు డైనమైట్లు పేలి కొన్ని జిల్లాల దాకా భూ ప్రకంపనలు వచ్చాయి. ఆరుగురు చనిపోయారు. అయితే, రాష్ట్రంలో అక్రమంగా నడుస్తున్న రాళ్ల క్వారీలు భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లైసెన్స్ ఉండి నడుస్తున్నవి 750 క్వారీలు మాత్రమే కాగా.. లైసెన్స్ లేకుండా నడుస్తున్నవి 2 వేలకుపైనే ఉన్నాయి. ఇవి అధికారులు చెబుతున్న లెక్కలు.

రాజధాని బెంగళూరులోనూ అలాంటి క్వారీలు ఎక్కువగానే ఉన్నాయని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. అత్యంత సున్నితమైన ప్రాంతాలకు అతి దగ్గర్లోనే ప్రమాదకర రీతిలో ఆ క్వారీలు కొనసాగుతున్నాయని అంటున్నారు. బ్యాలాలూ లోని ఇస్రో స్పేస్ సెంటర్, అర్కావతీ నది, మంచనబల డ్యామ్, బన్నేర్ ఘట్ట నేషనల్ పార్క్ వంటి వాటికి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలోనే అక్రమ రాళ్ల క్వారీలు నడుస్తున్నాయని వన్యప్రాణి నేషనల్ బోర్డ్ మాజీ సభ్యుడు ప్రవీణ్ భార్గవ్ చెప్పారు.

కాగా, 2018లో ప్రభుత్వ గనులు, భౌగోళిక శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం వేలాది అక్రమ క్వారీల్లో 30 వేల దాకా ఉల్లంఘనలు జరుగుతున్నట్టు తేలింది. దాదాపు మూడేళ్ల పాటు సర్వే చేసి ప్రభుత్వం ఆ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ఆధారంగా సహజ వనరులను కాపాడాలని, పర్యావరణ అసమతుల్యాన్ని నివారించాలని అధికారులను కర్ణాటక లోకాయుక్త జస్టిస్ పి. విశ్వనాథశెట్టి ఆదేశించారు. అప్పట్లో చాలా క్వారీలను మూసేసి రూ.110 కోట్ల దాకా జరిమానాలు వసూలు చేశారు.

అన్నింటినీ నిలువరిస్తామని సీఎం బీఎస్ యెడియూరప్ప హామీ ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి ప్రభావం లేదని అధికారులు అంటున్నారు. కొందరు కీలక రాజకీయ నాయకుల అనుచరులు చక్రం తిప్పి కీలకమైన ప్రాంతాల్లో క్వారీలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. అన్ని పార్టీల వారూ ఇందులో ఉన్నారని అంటున్నారు.