నేతాజీ గొప్ప హిందూవాది.. అయినా అన్ని మతాలనూ గౌరవించారు: నేతాజీ కూతురు

24-01-2021 Sun 11:33
  • అనుచరులు, సైన్యానికి ఎంతో స్ఫూర్తినిచ్చేవారన్న అనిత
  • ఆధునిక, ఆనంద భారత్ కోసం కలలుగన్నారని వెల్లడి
  • అందరూ ఆయన సిద్ధాంతాలను పాటించాలని పిలుపు
Netaji was devout Hindu but respected all faiths

నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప హిందూవాది అని, అయినా అన్ని మతాలనూ గౌరవించారని, సమానంగా చూసేవారని జర్మనీకి చెందిన ఆయన కూతురు అనిత బోస్ ఫాఫ్ అన్నారు. తన అనుచరులు, భారత జాతీయ సైన్యంలోని సభ్యులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఎంతో స్ఫూర్తినిచ్చారన్నారు. ఇతర మతాలను గౌరవించాలని చెప్తూనే ఆయన హిందూ మతాన్ని చాలా పటిష్ఠంగా ఆచరించేవారని చెప్పారు. శనివారం నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆమె జర్మనీ మ్యూనిచ్ లోని ఇండియన్ కాన్సులేట్ ద్వారా సందేశం ఇచ్చారు. ఆ వీడియోను ఇండియన్ కాన్సులేట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఐక్యతా, సహనం అనే సిద్ధాంతాలనే ఆయన జీవితాంతం అనుసరించారని అనిత గుర్తు చేశారు. ఆలోచనకు, అమలుకు ఆయన ప్రతిరూపం అన్నారు. నేతాజీ ఎప్పుడూ ఆధునిక, ఆనంద భారత్ కోసమే కలలు కనేవారన్నారు. అంతేగాకుండా చరిత్రలో వేళ్లూనుకుపోయిన సంస్కృతి, సిద్ధాంతాలు, మత సంప్రదాయాలనూ పాటించే ఇండియా కావాలనుకున్నారని చెప్పారు. నేతాజీ ఆలోచనలు, సిద్ధాంతాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.