స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు కరోనా చికిత్స బాధ్యత తల్లిదండ్రులదే... హామీ ఇవ్వాలంటూ వింత నిబంధన విధించిన తెలంగాణ!

24-01-2021 Sun 10:26
  • మరో వారంలో తెరచుకోనున్న స్కూళ్లు
  • తల్లిదండ్రుల నుంచి హామీ పత్రం తప్పనిసరి
  • అనారోగ్య వివరాలు వెల్లడించాల్సిందే
  • హాజరు తప్పనిసరి కాదన్న విద్యా శాఖ
Telangana Orders Parents Responsibility if Students Gets Corona

మరో వారంలో తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ వింత నిబంధన విధించింది. ప్రస్తుతానికి 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే స్కూళ్లకు అనుమతించాలని నిర్ణయించినప్పటికీ, ఒకవేళ, విద్యార్థికి కరోనా సోకితే, తల్లిదండ్రులే ప్రత్యేక చొరవ తీసుకుని వైద్య చికిత్సను అందిస్తామన్న హామీ ఇవ్వాల్సి ఉంటుందని, ఈ మేరకు విద్యార్థి, తల్లిదండ్రుల సంతకంతో కూడిన పత్రం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో వైద్యాధికారుల పర్యవేక్షణలో వారికి చికిత్స చేయించేందుకు సమ్మతిస్తున్నట్టు స్పష్టం చేస్తూ, హామీ ఇస్తేనే వారిని తరగతులకు అనుమతిస్తామని తెలిపింది. ఈ మేరకు గురుకుల సొసైటీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల నుంచి ఆయా హాస్టల్స్, స్కూళ్లకు ఆదేశాలు అందాయి.

ఇక ఈ అంగీకార పత్రంలో తమ బిడ్డకు సంబంధించిన ఇతర అనారోగ్య సమస్యలపై తల్లిదండ్రులు ముందస్తు సమాచారాన్ని ఇవ్వాలి. ఏదైనా అనారోగ్యం బారిన పడి చికిత్స తీసుకుంటూ ఉండి ఉంటే, అందుకు సంబంధిచిన వివరాలను చెప్పడంతో పాటు, ఆ మందులను విద్యార్థి వెంట పంపించాల్సి వుంటుందని కూడా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇక విద్యా సంస్థలు తెరచుకున్నా, హాజరు మాత్రం తప్పనిసరి కాదన్న వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. తల్లిదండ్రులు అంగీకరిస్తేనే విద్యార్థులు ప్రత్యక్షంగా స్కూళ్లకు హాజరు కావచ్చని వెల్లడించారు.

కాగా, స్కూళ్లకు వచ్చేందుకు సమ్మతించని విద్యార్థుల కోసం యథావిధిగా ఆన్ లైన్ మాధ్యమంగా బోధన సాగించవచ్చని, స్కూళ్లలో విద్యార్థుల హాజరు సమాచారం కోసం మాత్రమే అటెండెన్స్ తీసుకుంటారే తప్ప, అదేమీ పరీక్షలకు అడ్డంకి కాదని ఉన్నత విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం వరకూ నిర్దిష్ట హాజరు నిబంధనను తొలగించామని పేర్కొన్నారు.