ట్రంప్ చేసిన చిట్టచివరి ఆకతాయి పని... తలుపులు తెరచుకోక కాసేపు గేటు ముందే నిలుచున్న జో బైడెన్!

24-01-2021 Sun 09:45
  • తలుపులు తెరిచే అధికారి పదవీ విరమణ
  • విషయం చెప్పని అధికారి, సమాచారం ఇవ్వని ట్రంప్
  • ట్రంప్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్న తిమోతీ
  • ఆయన వెళ్లిపోవడంతో నిమిషం పాటు వేచి చూసిన బైడెన్ దంపతులు
Trump Petty Act that Left Biden Wait a Minute at White House Gae

నాలుగు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్, తన సతీమణితో కలిసి తొలిసారి అధికారికంగా వైట్ హౌస్ లో ప్రవేశించే వేళ, ట్రంప్ చేసిన ఓ ఆకతాయి పని కారణంగా కాసేపు గేటు ముందే నిలిచి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో తొలి మహిళ జిల్ తో కలిసి ఆయన ఫోటోలకు ఫోజులిస్తూ, చేతులు ఊపుతూ కనిపించారు. దాదాపు ఒక నిమిషం పాటు వైట్ హౌస్ తలుపులు తెరచుకోలేదని సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న వీడియోలు చెబుతున్నాయి.

ఆ సమయంలో తన భార్యను కౌలిగించుకుంటూ, అతిథులకు అభివాదం చేస్తూ, బైడెన్ అక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. "ఓ పెద్ద ప్రొటోకాల్ అవరోధం ఏర్పడింది. ఈ తలుపులను మెరైన్ గార్డ్స్ తెరవాల్సి వుంది. కానీ అది జరగలేదు" అని 'నేషనల్ జర్నల్' పేర్కొంది. ట్రంప్ తాను వెళుతూ వెళుతూ శ్వేతసౌధం బట్లర్స్, ఇతర ఉద్యోగులను వారివారి ఇళ్లకు పంపుతూ సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బైడెన్ విధుల్లో ఉన్న మిగతా వారి గురించి వేచి చూడాల్సి వచ్చిందని, ఇది ఓ అనుకోని అవాంతరమని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ తలుపులను తెరిచి స్వాగతం పలకాల్సిన తిమోతీ హెర్లెత్ అనే ఉద్యోగి, ట్రంప్ పదవీ విరమణ చేయడానికి ముందే రిటైర్ అయ్యారని తెలుస్తోంది. వైట్ హౌస్ తో పాటు అధ్యక్షుడి నివాసం, ఇతర ఉద్యోగుల అవసరాలు, భవంతి నిర్వహణ, రీ మోడలింగ్, కిచెన్ తదితరాలను ఆయనే పరిశీలిస్తుంటారు. తిమోతీ ప్లేస్ లో ఇంకో అధికారి నియామకం జరగక పోవడం కూడా బైడెన్ వేచి చూడటానికి కారణమని, సదరు అధికారి లేడన్న విషయాన్ని ట్రంప్ ఏ అధికారికీ తెలియజేయలేదని, తిమోతీ కూడా సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోయాడని తెలుస్తోంది.

కాగా, సదరు తిమోతీ హెర్లెత్, ట్రంప్ భార్య మెలానియా కొనుగోలు చేసిన హోటల్స్ లో పనిచేస్తుండేవారు. ఆపై ట్రంప్ అధ్యక్షుడు కాగానే, అతన్ని తీసుకుని వచ్చి వైట్ హౌస్ నిర్వహణాధికారిగా నియమించారు. అతనే వైట్ హౌస్ గేట్లను తెరుస్తూ, మూసివేస్తూ ఉంటారు. వైట్ హౌస్ తలుపులను తెరవడం అన్న విధి అతని చేతుల్లోనే ఉంటుందని, తాను వెళ్లే సమయంలో ఎవరికీ చెప్పలేదని, ఆ విషయాన్ని గుర్తించక పోవడం వైట్ హౌస్ ఉద్యోగుల వైఫల్యమని బైడెన్ స్టాఫ్ ఆరోపించింది.

కాగా, తిమోతీ హెర్లెత్ గత నవంబర్ లో వైట్ హౌస్ లో తనకింద పనిచేసే పలువురు ఉద్యోగులను కూడా తొలగించారని తెలుస్తోంది. ట్రంప్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తుల్లో ఒకరైన తిమోతీ చేసిన పనుల కారణంగానే కొన్ని క్షణాల పాటు తలుపులు తెరచుకోలేదని, ఆపై వెంటనే అధికారులు వాటిని తెరచి, బైడెన్ ను స్వాగతించారని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. తలుపుల ముందు వేచిచూస్తున్న బైడెన్ దంపతుల చిత్రలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.