ఉత్తరాఖండ్ కు నేడు ఒక రోజు సీఎం... చాన్స్ కొట్టేసిన 19 ఏళ్ల యువతి!

24-01-2021 Sun 08:15
  • అవకాశం దక్కించుకున్న సృష్టి గోస్వామి
  • ప్రస్తుతం బీఎస్సీ  థర్డ్ ఇయర్ చదువుతున్న సృష్టి
  • వివిధ పథకాలపై సమీక్షలు నిర్వహించనున్న సీఎం
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
One Day CM for Uttarakhand Today is Shristhi Goswami

'ఒక రోజు సీఎం' అన్న పేరు చాలా మందికి సుపరిచితమే. ఈ లైన్ స్టోరీగా సినిమాలు కూడా వచ్చి ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు రియల్ లైఫ్ లో 19 ఏళ్ల యువతి, ఈ అవకాశాన్ని కొట్టేసింది. డెహ్రాడూన్ కు చెందిన సృష్టి గోస్వామి నేడు ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలను నిర్వర్తించనుంది. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సృష్టికి ఈ అవకాశం లభించింది. రాష్ట్రానికి వేసవి రాజధానిగా ఉన్న గైర్ సెయిన్ పట్టణం నుంచి నేడు పాలన సాగించనున్న ఆమె, ప్రభుత్వం నడుపుతున్న వివిధ సంక్షేమ పథకాలపై సమీక్షలు నిర్వహించనున్నారు.

ప్రస్తుతం బీఎస్సీ మూడవ సంవత్సరం చదువుతున్న సృష్టి, తనకు లభించిన అవకాశంపై స్పందిస్తూ, "ఇటువంటి అవకాశం జీవితంలో ఒకేసారి లభిస్తుంది. నాకు ఈ చాన్స్ వస్తుందని నేను నమ్మలేదు. ఈ అవకాశం రావడం పట్ల ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. పరిపాలన విషయంలో యువత ఎంత సమర్థవంతంగా ఉంటుందన్న విషయాన్ని నా పనితో నేను నిరూపించాలని భావిస్తున్నాను. ఈ రోజు నేను ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తాను" అని అన్నారు.

కాగా, నేడు సృష్టి గోస్వామి అటల్ ఆయుష్మాన్ స్కీమ్ తో పాటు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, హోమ్ స్టే స్కీమ్, రాష్ట్ర టూరిజం విభాగం తీరుతెన్నులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించి, తనదైన ఆదేశాలను ఇవ్వనున్నారు. కాగా, సృష్టి, 2018 నుంచి బాల్ విధాన్ సభ సీఎంగా పని చేస్తున్నారు.

ఇక, ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాల అధికారులు, ఆమె ముందు సవివరణాత్మక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆమె ఒక రోజు సీఎం బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు ఉత్తరాఖండ్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సైతం తనవంతు సహకారాన్ని అందించనున్నారు.

సృష్టి ఒక రోజు సీఎంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయి పోయాయని, గైర్ సెయిన్ లోని రాష్ట్ర అసెంబ్లీ భవంతిలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని వ్యాఖ్యానించిన చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్ పర్సన్ ఉషా నేగి, ఆమె సత్తా తనకు ప్రత్యక్షంగా తెలుసునని అన్నారు. సీఎంగా ఆమె తనవంతు బాధ్యతలను గౌరవంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.