India: భారత్ పై పొగడ్తల వర్షం కురిపించిన అమెరికా!

  • స్నేహానికి నిజమైన అర్థం చెబుతున్న ఇండియా
  • ట్విట్టర్ లో సౌత్ సెంట్రల్ ఆసియా వ్యవహారాల విభాగం
  • టీకా కోసం ఇండియావైపు చూస్తున్న పలు దేశాలు
US Hails India for Vaccine Supply

నిజమైన స్నేహానికి భారత్ అర్థం చెబుతోందని, వివిధ దేశాలకు కరోనా టీకాను అందించడం ద్వారా మహమ్మారిని తరిమి కొట్టేందుకు తనవంతు తోడ్పాటును అందిస్తోందని యూఎస్ఏ ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ ఆసియా వ్యవహారాలను పరిశీలించే అమెరికా విభాగం, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టింది. "ఇండియా తన స్నేహ భావాన్ని చాటుతూ దక్షిణాసియాలోని ఎన్నో దేశాలకు టీకాను అందిస్తోంది. కరోనా నుంచి ప్రపంచ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇండియా తీసుకుంటున్న చర్యలు హర్షించ తగినవి" అని వ్యాఖ్యానించింది.

కాగా, గడచిన వారం రోజుల్లో ఇండియా నుంచి బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, మాల్దీవులు, మారిషస్ తదితర ప్రాంతాలకు ఉచితంగా టీకా వయల్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్, సౌదీ అరేబియా, మొరాకో దేశాలకు వాణిజ్య ఎగుమతులు కూడా ప్రారంభం అయ్యాయి. మరిన్ని దేశాలు వ్యాక్సిన్ కోసం ఇండియావైపు చూస్తున్నాయి. తమకు వ్యాక్సిన్ ను సరఫరా చేయాలని పలు దేశాల నుంచి ఇండియాకు విజ్ఞప్తులు అందాయి.

కాగా, ఇండియాలో తయారవుతున్న వ్యాక్సిన్ లు ప్రపంచానికి ఉపయోగపడాలని, కరోనాను ఇవి నియంత్రించగలవని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మొత్తం ప్రపంచంలో తయారవుతున్న వ్యాక్సిన్లలో 60 శాతం ఇండియాలోనే తయారవుతున్నాయి. భారత డ్రగ్ కంపెనీలు టీకా విషయంలో మిగతా దేశాలకన్నా ముందు నిలిచి, నిత్యమూ లక్షల సంఖ్యలో వయల్స్ ను తయారు చేస్తున్నాయి.

ఇక ఇదే విషయాన్ని ప్రస్తావించిన అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ గ్రెగరీ మీక్స్, ఇండియా అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలని అన్నారు. పలు విదేశీ మీడియా సంస్థలు సైతం టీకాను సరఫరా చేస్తున్న భారత్ ను కొనియాడుతూ కథనాలు ప్రచురిస్తున్నాయి. టీకా విషయంలో భారత కృషిని గుర్తించినందుకు యూఎన్ లో భారత రాయబారి తరన్ జిత్ సింగ్, యూఎస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

More Telugu News