ఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు ఎవరినీ వదలడంలేదు.... చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటే బదిలీ చేస్తున్నారు: ఎస్ఈసీపై అంబటి ధ్వజం

23-01-2021 Sat 20:48
  • పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ పట్టుదల
  • వ్యతిరేకిస్తున్న వైసీపీ సర్కారు
  • ఎస్ఈసీపై వైసీపీ నేతల ఆగ్రహం
  • అధికారులపై కక్ష సాధిస్తున్నారన్న అంబటి
  • మూడేళ్లుగా ఏంచేస్తున్నారని వ్యాఖ్యలు
Ambati Rambabu comments on SEC Nimmagadda

పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాలని కంకణం కట్టుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా నిమ్మగడ్డపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై ఎస్ఈసీ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న అధికారులను ఎవరినీ వదలడంలేదని, ఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు అందరినీ బదిలీ చేస్తున్నారని వివరించారు.

రాజ్యాంగ బద్ధంగా విధులు నిర్వర్తిస్తే ఎవరూ అభ్యంతరపెట్టబోరని, కానీ ఎన్నికల పేరిట ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం సబబు కాదని అంబటి హితవు పలికారు. మూడేళ్ల పాటు ఎన్నికల ఊసే ఎత్తకుండా, కోర్టుల్లో ఎలాంటి న్యాయపోరాటాలు చేయకుండా, ఇప్పుడొచ్చి ఎన్నికలు అంటున్నారని మండిపడ్డారు.

"మరో మూడు నెలల్లో ఎస్ఈసీ పదవీకాలం ముగియనుంది. ఆ లోపే ఎన్నికలు నిర్వహించి అధికారాన్ని చెలాయించాలని తాపత్రయపడుతున్నారు. ఎన్నికలు మీ సొంత వ్యవహారం కాదు. అమెరికాలో ఎన్నికలు జరిగాయి, ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికలు నిర్వహించారని అంటున్నారు... ఆ సమయంలో అక్కడ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాలేదన్న విషయం ఎస్ఈసీ తెలుసుకోవాలి. కానీ రాష్ట్రంలో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు ఒకటిన్నర నెల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగులు, ప్రజల ప్రాణాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు వద్దంటోంది" అని అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు.