ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై ఎస్ఈసీ ఆందోళన... డీజీపీకి లేఖ

23-01-2021 Sat 18:46
  • ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వాలన్న వెంకట్రామిరెడ్డి
  • అప్పటివరకు ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని స్పష్టీకరణ
  • ప్రాణాపాయం వస్తే ప్రాణాలు తీసే హక్కును రాజ్యాంగం కల్పించిందని వ్యాఖ్యలు
  • ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎస్ఈసీ
  • వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలంటూ లేఖ
SEC Nimmagadda writes to DGP over employs federation leader Venkatrami Reddy comments

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నేత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. వెంకట్రామిరెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ ఆ లేఖలో స్పష్టం చేశారు. ప్రాణహాని కలిగిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని నిమ్మగడ్డ డీజీపీని కోరారు.

అంతకుముందు, ఏపీ ఉద్యోగుల సమాఖ్య నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వాలని, వ్యాక్సిన్ ఇచ్చేంత వరకు తాము ఎన్నికల విధులకు హాజరు కాబోమని తెగేసి చెప్పారు. అంతేకాదు, ప్రాణాపాయం వస్తే ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసే హక్కును కూడా రాజ్యాంగం కల్పించిందని అన్నారు.