షూటింగులో ప్రమాదం నుంచి తప్పించుకున్న సంపూర్ణేష్ బాబు

23-01-2021 Sat 17:12
  • 'బజార్ రౌడీ' సినిమా షూటింగులో ప్రమాదం
  • బైక్ పై అదుపుతప్పి కిందకు పడిన వైనం
  • గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యూనిట్ సభ్యులు
Sampoornesh Babu escapes from accident

టాలీవుడ్ సినీ నటుడు సంపూర్ణేశ్ బాబు షూటింగ్ లో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన తాజా చిత్రం 'బజార్ రౌడీ' క్రైమాక్స్ షూటింగ్ లో ప్రమాదం సంభవించింది. యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది.

కొంత ఎత్తు నుంచి కిందకు బైక్ పై ఆయన రావాల్సి ఉంది. అయితే, అదుపుతప్పి ఆయన కిందకు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన యూనిట్ సభ్యులు ఆయనను పైకి లేవనెత్తారు. అయితే, ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ చిత్రానికి వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తుండగా... సందిరెడ్డి శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సంపూ క్షేమంగా ఉన్నారని, త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటారని యూనిట్ వర్గాలు ప్రకటించాయి.