Nimmagadda Ramesh: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పై విమర్శలు గుప్పించిన‌ తమ్మినేని సీతారాం

Tammineni Sitaram fires on Nimmagadda Ramesh
  • ఎవరి ప్రాపకం కోసం ఎన్నికలను నిర్వహిస్తున్నారు
  • వలస కార్మికుల ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉంది
  • ఐఏఎస్, ఐపీఎస్ లను కూడా బెదిరిస్తున్నారు
రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో ఎవరి ప్రాపకం కోసం, ఎవరి రాజకీయ లబ్ధి కోసం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్నారని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ను ఉద్దేశించి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. నిమ్మగడ్డ నిర్వహించిన ప్రెస్ మీట్ రాజకీయ సమావేశం మాదిరి ఉందని అన్నారు. చుట్టూ అద్దాలు బిగించుకుని ప్రెస్ మీట్ పెట్టారని ఎద్దేవా చేశారు. ఎన్నికలలో ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వలస కార్మికులు వస్తారని... గతంలో వీరి ద్వారా కరోనా వ్యాపించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపే ప్రమాదం ఉందని అన్నారు.

ఎస్ఈసీగా మీరు ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహించాలా? మరొకరు జరపకూడదా? అని ప్రశ్నించారు. నియంతృత్వ పోకడలు ఎందుకని అడిగారు. ఎన్నికల వల్ల కరోనా సోకి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా బెదిరించే ధోరణిలో వెళ్తున్నారని మండిపడ్డారు. ఒక రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా ఉండి నిబంధనలను అతిక్రమిస్తున్నారని విమర్శించారు. న్యాయస్థానం తీర్పును మీరు ఉల్లంఘించలేదా? అని ప్రశ్నించారు.

ఎన్నికలను ఎన్జీవోలు బహిష్కరించారని, రేపోమాపో పోలీసులు కూడా బహిష్కరిస్తారని... అప్పుడు ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారని తమ్మినేని ప్రశ్నించారు. ఎన్నికలు వద్దని ప్రజలు, ఉద్యోగులు తిరగబడితే మీ పరిస్థితి ఏమిటని అడిగారు. కొందరి ప్రయోజనాల కోసం మీరు తీసుకున్న నిర్ణయం ఎందరికో ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. దీనిపై ప్రజలు కూడా ఆలోచించాలని సూచించారు.
Nimmagadda Ramesh
SEC
Tammineni Sitaram
YSRCP

More Telugu News