Anand Mahindra: టీమిండియా యువ క్రికెటర్లకు మహీంద్రా వాహనాలు... ఆనంద్ నజరానా

  • ఆసీస్ టూర్ లో అదరగొట్టిన భారత యువకిశోరాలు
  • ఎస్ యూవీలు కానుకగా ఇస్తున్నట్టు ఆనంద్ మహీంద్రా ప్రకటన
  • ఆటగాళ్లపై ప్రశంసలు జల్లు
  • సిరాజ్, సుందర్, ఠాకూర్, సైనీ, నటరాజన్ లకు థార్ వాహనాలు
Anand Mahindra announced Mahindra all new Thar vehicles for Team India young cricketers

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చిరస్మరణీయమైన రీతిలో టెస్టు సిరీస్ గెలవడం తెలిసిందే. ఈ చారిత్రాత్మక విజయంలో యువ క్రికెటర్లు ముఖ్యభూమిక పోషించడం భారత క్రికెట్ భవిష్యత్తుపై మరిన్ని ఆశలు రేకెత్తిస్తోంది. సిరాజ్, సుందర్ వంటి కొత్త ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా మహీంద్రా వ్యాపార సామ్రాజ్య అధినేత ఆనంద్ మహీంద్రా భారత జట్టులోని ఆరుగురు యువ క్రికెటర్లకు నజరానా ప్రకటించారు.

ఆస్ట్రేలియా పర్యటనలో తమ టెస్టు కెరీర్ ప్రారంభించిన మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ (గతంలోనే అరంగేట్రం చేసినా గాయం కారణంగా సుదీర్ఘ విరామం వచ్చింది), శుభ్ మాన్ గిల్, నటరాజన్, నవదీప్ సైనీలకు మహీంద్రా థార్ ఎస్ యూవీలను ఇవ్వనున్నట్టు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఈ ఆరుగురు ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటన ద్వారా భవిష్యత్తుపై ఆశలు కల్పించారని కొనియాడారు.

అసాధ్యాలను సైతం సాధ్యం చేయొచ్చని భావితరాల వారు కలలు కనేలా ఈ యువ క్రికెటర్లు అమోఘంగా రాణించారని ఆనంద్ కితాబునిచ్చారు. వీళ్లు ఎన్నో అవాంతరాలను అధిగమించి జాతీయజట్టుకు ఎంపికయ్యారని, ప్రతికూల పరిస్థితుల్లో మైదానంలో వీరు రాణించిన విధానం జీవితంలోని అన్ని అంశాలకు అన్వయించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా టూర్ ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కెరీర్ షురూ చేసిన వీరికి సరికొత్త మోడల్ థార్ వాహనాలను బహూకరిస్తుండడం వ్యక్తిగతంగా ఎంతో సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు.

ఈ ఖర్చంతా తానే భరిస్తున్నానని, కంపెనీకి ఈ వాహనాల ఖర్చుతో సంబంధం లేదని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. యువత తమను తాము నమ్మేలా ప్రేరణ కలిగిస్తుందన్న ఉద్దేశంతోనే ఈ కానుకలు అందజేస్తున్నానని వివరించారు.

More Telugu News