ప్రకాశం జిల్లాలో పవన్ కల్యాణ్ చేతికి ప్రత్యేక బ్యాడ్జి గమనించారా..?

23-01-2021 Sat 15:20
  • ప్రకాశం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్
  • కార్యకర్త ఆత్మహత్యపై ఎస్పీకి విజ్ఞాపన పత్రం అందజేత
  • ఆ సమయంలో చేతికి ప్రత్యేక బాడ్జి ధరించిన పవన్
  • బ్యాడ్జిపై ప్రకటన విడుదల చేసిన జనసేన పార్టీ
Pawan Kalyan wears Specially designed badge in Prakasham district

ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన చేతికి ఓ ప్రత్యేక బ్యాడ్జి ధరించి కనిపించారు. జనేన కార్యకర్త వెంగయ్యనాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పవన్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ను కలిసిన సందర్భంగా ఆయన బ్యాడ్జి ధరించే వెళ్లారు. ఈ బ్యాడ్జిపై జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇకపై జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు ఈ విధమైన ప్రత్యేక బ్యాడ్జిలు ధరిస్తారని తెలిపారు. పార్టీ శ్రేణులపై అక్రమకేసులు బనాయించినప్పుడు, అధికార పక్ష నేతలు దాడులు చేసినప్పుడు నిరసన కార్యక్రమాలు చేపట్టే సందర్భాల్లో చేతికి ఈ బ్యాడ్జి ధరించాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచన అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ బ్యాడ్జిపై పార్టీ చిహ్నం, జనసేన అనే అక్షరాలు ముద్రించి ఉంటాయి. సాధారణంగా నిరసనలు, ఆందోళనల సమయాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించడం తెలిసిందే. ఇప్పుడీ ప్రత్యేక బ్యాడ్జి ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సంఘటితం అయ్యేలా ఒక భావన వ్యాప్తి చేయవచ్చన్నది పవన్ ఆలోచన అని, ఆయన ఆలోచన ఆధారంగా ఈ బ్యాడ్జికి రూపకల్పన జరిగిందని జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.