USA: బలగాలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ క్షమాపణ

President Biden apologises over troops sleeping in car park
  • కారు పార్కింగ్ లో సైనికులు విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోలు వైరల్
  • వసతి ఏర్పాటు చేయకపోవడంపై ఆవేదన
  • నేషనల్ గార్డ్ చీఫ్ కు ఫోన్ చేసిన బైడెన్
  • ఈ పరిస్థితి రాకుండా ఏదైనా చేస్తామని హామీ
  • తమను కాపాడుతున్నందుకు థ్యాంక్స్ చెప్పిన ప్రథమ మహిళ
  • ఘటనపై సెనేట్ రూల్స్ కమిటీ దర్యాప్తు
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం చేసే సమయాన 25 వేల మందికిపైగా బలగాలు కంటిపై కునుకు లేకుండా ఆ దేశ చట్టసభ క్యాపిటల్ హిల్ వద్ద కాపుగాశారు. ఆ వేడుక అంతా అయిపోయి.. ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోయాక సైనికులు కాస్తంత నడుం వాల్చారు. కనురెప్ప వాల్చి విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకుంటే మంచిదేగానీ.. వాళ్లు పడుకున్న తీరే అందరినీ కలచివేసింది.

కనీసం దుప్పట్లు కూడా లేని స్థితిలో ఓ కార్ పార్కింగ్ స్థలంలో సైనికులు పడుకున్నారు. అడుగడుగునా నిఘా వేస్తూ కంటికి రెప్పలా కాపాడే సైనికులు నిద్రపోవడానికి సరైన స్థలం కూడా ఇవ్వలేరా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించలేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు తమ తమ బలగాలను ఉపసంహరించుకునే దాకా వెళ్లింది పరిస్థితి.

ఆ ఫొటోలు అధ్యక్షుడు జో బైడెన్ దాకా వెళ్లాయి. దీనిపై ఆయన వెంటనే స్పందించారు. శుక్రవారం నేషనల్ గార్డ్స్ బ్యూరో చీఫ్ కు ఫోన్ చేశారు. ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు ఆయన క్షమాపణలు కోరినట్టు స్థానిక మీడియా కథనాలు రాసింది. అంతేగాకుండా భవిష్యత్ లో మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆరా తీసినట్టు సమాచారం.

దేశ ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ బలగాలను వ్యక్తిగతంగా కలిశారు. శ్వేతసౌధంలో చేసిన బిస్కెట్లను తీసుకెళ్లి సైనికులకు ఆప్యాయంగా పంచారు. తనను, తన కుటుంబాన్ని సురక్షితంగా, భద్రంగా చూసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పడానికే వచ్చానని ఆమె బలగాలకు చెప్పారు. కాగా, బలగాలు విశ్రాంతి కోసం తమ ఆఫీసులను ఇచ్చేందుకు కొందరు సెనేటర్లు ముందుకు వచ్చారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సెనేట్ రూల్స్ కమిటీ ప్రకటించింది. క్యాపిటల్ కాంప్లెక్స్ లో బలగాలు డ్యూటీ తర్వాత రెస్ట్ తీసుకునేందుకు వీలుగా వసతి ఏర్పాట్లు చేస్తున్నామని నేషనల్ గార్డ్, క్యాపిటల్ పోలీసులు సంయుక్తంగా ప్రకటన చేశారు. డ్యూటీ ఆఫ్ లో ఉన్న బలగాలకు హోటల్ గదుల్లో వసతి ఇస్తామన్నారు.

మరి కొన్ని రోజుల్లో 19 వేల మంది దాకా బలగాలను తమ సొంత రాష్ట్రాలకు పంపించనున్నట్టు తెలుస్తోంది. మిగతా వాళ్లకు క్యాపిటల్ హిల్ వద్దే డ్యూటీ వేస్తారని సమాచారం.

కరోనా వచ్చిందట!

మరోపక్క, క్యాపిటల్ హిల్ నుంచి బలగాలు ఎందుకు వెళ్లిపోయాయన్న దానిపైనా జోరుగా చర్చ నడుస్తోంది. అయితే, పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే గురువారం బలగాలను అక్కడి నుంచి పంపించామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అక్కడ గస్తీ డ్యూటీ చేసిన సైనికుల్లో 100 నుంచి 200 మంది వరకు కరోనా బారిన పడ్డారని ఓ అధికారి చెప్పారు.
USA
Joe Biden
National Guards
Capitol Hill

More Telugu News