అవసరమైతే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం: ఏపీఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి

23-01-2021 Sat 14:52
  • స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏపీ ఉద్యోగ సంఘాలు
  • ఎస్ఈసీ మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపాటు
  • తాము ఈ అంశంలో సుప్రీంను ఆశ్రయించినట్టు వెల్లడి
  • హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు స్పష్టీకరణ
APNGO threatens if needed they will boycott Panchayat elections

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఉద్యోగుల సంఘాలు వ్యతిరేక గళం వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు నిలిపివేయకుంటే ఎన్నికల బహిష్కరణకు తాము సిద్దంగా ఉన్నామంటూ ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. అవసరమైతే సమ్మెకు కూడా వెళతామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యమని అంటున్నారు. దీనిపై ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

స్థానిక ఎన్నికల అంశంలో ఎస్ఈసీ మాట్లాడుతున్న తీరు తమకు చాలా బాధ కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో కరోనా బారినపడి పెద్ద సంఖ్యలో చనిపోయారని, భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇలాంటి సమయంలో వ్యాక్సినేషన్ తర్వాత ఎన్నికలకు వెళతామని తాము అటు ప్రభుత్వాన్ని, ఇటు ఎన్నికల సంఘాన్ని వేడుకున్నామని వివరించారు. అయినప్పటికీ ఎస్ఈసీ ఎంతో మొండిగా వ్యవహరించి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.

తాము ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని, సోమవారం నాడు విచారణ ఉందని తెలిపారు. ఈలోగానే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని అన్నారు. ఇవేమీ సాధారణ ఎన్నికలు కాదని, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రాణాలతో చెలగాటమాడుతూ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

"మరో రెండు, మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తవుతుంది... ఆ తర్వాత ఎన్నికలకు వెళదాం అని చెప్పాం. ఈ రెండున్నరేళ్లలో లేనంత అత్యవసర పరిస్థితి ఇప్పుడేమైనా ఉందా? ఎస్ఈసీ ఎందుకింత పంతానికి పోతున్నారు? స్థానిక ఎన్నికలు నిర్వహించేవాళ్లే అయితే ఈ రెండున్నరేళ్లలో ఏంచేశారు? ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? ఎస్ఈసీ గాజు అద్దాల చాటున దాక్కుని  ప్రెస్ మీట్లో మాట్లాడారు... మేం కూడా ఇళ్లలో గాజు అద్దాల మాటున ఉండి ఎన్నికల విధులు నిర్వర్తించాలా..?

ఎన్నికలంటే ప్రజలతో మమేకం అవ్వాల్సి ఉంటుంది. కొందరు ఉద్యోగులు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు దుష్పరిణామాలకు గురయ్యే ప్రమాదం ఉంది. చర్యలు తీసుకుంటాం అని మీరు ఎంతమందిని భయభ్రాంతులకు గురిచేస్తారు? అయినప్పటికీ మేం భయపడం" అని స్పష్టం చేశారు.

కాగా, వ్యాక్సినేషన్ తో పాటు ఎన్నికలు కూడా నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామన్న చంద్రశేఖర్ రెడ్డి... ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించి ఉద్యోగులను చంపమని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని అన్నారు. వ్యాక్సిన్ తో వ్యాధినిరోధక శక్తి పెంచుకున్న తర్వాత ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని సీఎస్ కూడా చెప్పారని ఆయన వివరించారు. తమ తరఫున దాఖలైన విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలు చేసి నోటిఫికేషన్ ఇవ్వాడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ కరోనా వ్యాప్తి అధికమైనట్టు తేలిందని, ఇవేవీ పట్టించుకోకుండా ఎన్నికలు జరపాలని నిర్ణయించుకుంటే ఆ ఎన్నికలను బాయ్ కాట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.