కర్ణాటకలో స్వామీజీ కిడ్నాప్

23-01-2021 Sat 14:26
  • కర్ణాటకలో అమ్మాజీ అనే స్వామీజీని కిడ్నాప్ చేసిన దుండగులు
  • నాలుగు రోజులు చిత్రహింసలు  పెట్టారన్న స్వామీజీ
  • దుండగులను పోలీసులు వదిలేశారని ఆరోపణ
Swamiji kidnapped in Karnataka

స్వామీజీని కిడ్నాప్ చేసిన ఘటన కర్ణాటకలో కలకలం రేపుతోంది. బార్లీ జిల్లా కపిలాపూర్ లో అమ్మాజీ అనే స్వామీజీని దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే వారి చెర నుంచి ఆయన బయటపడ్డారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ, భాస్కర్ రెడ్డి, సతీశ్ అనే వ్యక్తులు విమానంలో షిర్డీ వెళ్దామని నమ్మించి తనను కిడ్నాప్ చేశారని చెప్పారు.

హైదరాబాదుకు తీసుకొచ్చి శంషాబాద్ మీదుగా బెంగళూరుకు తీసుకెళ్లారని తెలిపారు. అక్కడ తనను ఓ గదిలో బంధించి, డబ్బులు డిమాండ్ చేశారని చెప్పారు. నాలుగు రోజుల పాటు చిత్ర హింసలు పెట్టారని తెలిపారు. రూ. 5 కోట్లు ఇస్తానని తాను ఒప్పుకోవడంతో మళ్లీ హైదరాబాదుకు తీసుకొచ్చారని చెప్పారు.

వారి నుంచి తప్పించుకున్న తాను హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశానని స్వామీజీ తెలిపారు. దుండగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... కేసులు పెట్టకుండానే వారిని వదిలేశారని విమర్శించారు. మరోవైపు ఈ ఘటనపై లంగర్ హౌస్ సీఐ మాట్లాడుతూ, కిడ్నాప్ పై ఫిర్యాదు చేసేందుకు స్వామీజీ ముందుకు రాలేదని... తనను కిడ్నాప్ చేసినవారు తన భక్తులేనని, వారిని వదిలేయాలని స్వామీజీ కోరారని తెలిపారు.