అన్నా రాంబాబూ.. నిన్ను పాతాళానికి తొక్కేస్తాం: పవన్ కల్యాణ్ వార్నింగ్

23-01-2021 Sat 13:58
  • వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన పవన్
  • అన్నా రాంబాబు వల్లే వెంగయ్య ప్రాణాలు కోల్పోయారు
  • ఇలాంటి దారుణాలు ఎక్కువైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందన్న పవన్ 
Pawan Kalyan gives warning to Anna Rambabu

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఆయన వల్లే జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సమస్యపై రాంబాబుని నిలదీసినందుకు... ఆయనను చంపేశారని అన్నారు. ప్రశ్నించే వారి కుటుంబాలను నాశనం చేయాలనుకుంటే కుదరదని చెప్పారు. ఇలాంటి దారుణాలు ఎక్కువైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని అన్నారు. ఈ రోజు వెంగయ్య నాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా అన్నా రాంబాబుకు పవన్ వార్నింగ్ ఇచ్చారు. అన్నా రాంబాబూ గుర్తుంచుకో.. నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తాం అని హెచ్చరించారు. 'జగన్ రెడ్డి గారూ మీ ఎమ్మెల్యే చేసిన పనికి ఆయనను శిక్షిస్తారా? అంత ధైర్యం మీకు ఉందా?' అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. జర్నలిస్టులను కూడా వదలడం లేదని అన్నారు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? లేక ఫ్యూడలిస్టు వ్యవస్థలో ఉన్నామా? అనే విషయాన్ని జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.