'ఆర్ఆర్ఆర్' విడుద‌ల తేదీని లీక్ చేసిన ఐరిష్ నటి!

23-01-2021 Sat 13:48
  • ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఐరిష్‌ నటి అలిసన్‌ డూడీ పోస్ట్
  • ఆక్టోబ‌ర్ 8న విడుద‌లవుతుంద‌ని పేర్కొన్న న‌టి
  • అనంత‌రం డిలీట్ చేసిన వైనం
iris actress announces rrr movie release date

బాహుబ‌లి సినిమా త‌ర్వాత‌ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మ‌ల్టీ స్టార‌ర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' విడుద‌ల ఎప్పుడ‌నే విష‌యంపై ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్ వంటి యంగ్, ఎన‌ర్జిటిక్ హీరోలు ఈ సినిమాలో న‌టిస్తోన్న నేప‌థ్యంలో ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందా? అని ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ను ఒక్కొక్క‌టిగా ప్ర‌క‌టిస్తూ రాజ‌మౌళి ప్రేక్ష‌కుల్లో ఆ అంచ‌నాల‌ను మ‌రింత పెంచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇటువంటి స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఐరిష్‌ నటి అలిసన్‌ డూడీ సినిమా తేదీని ఎవ‌రికీ చెప్ప‌కుండా ప్ర‌క‌టించేసింది. ఈ సినిమా విడుద‌ల తేదీ అక్టోబ‌రు 8 అంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ స్టోరీలో తెలిపింది. దానికి ఆర్‌ఆర్‌ఆర్ అకౌంట్‌ను జత చేసింది. కొద్ది సేప‌టికే ఆమె మ‌ళ్లీ
ఈ పోస్టును తొల‌గించింది. అప్ప‌టికే కొద్ది మంది స్క్రీన్ షాట్లు తీసుకుని పెట్టుకున్నారు.

హాలీవుడ్‌లో సినమా విడుద‌ల తేదీలను ముందుగానే ప్ర‌క‌టించి, క‌చ్చిత‌మైన తేదీకి విడుద‌ల చేస్తుంటారు. టాలీవుడ్‌లోనూ అలాగే చేస్తార‌ని ఆమె అనుకుని ఇలా సినిమా తేదీని ప్ర‌క‌టించి ఉంటుంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. 'ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో రాజ‌మౌళికే తెలియ‌దు.. ఈమెకెలా తెలిసింద‌'ని కొంద‌రు సెటైర్లు వేస్తున్నారు.