ఒలింపిక్స్​ క్రీడాకారులందరికీ కరోనా వ్యాక్సిన్​: డబ్ల్యూహెచ్​ వోతో ఒలింపిక్స్​ కమిటీ చర్చలు!

23-01-2021 Sat 13:17
  • ఒలింపిక్స్ రద్దవుతాయన్న కథనాలు
  • అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసిన ఐవోసీ
  • అనుకున్న టైంకు నిర్వహిస్తామని వెల్లడి
IOC working with WHO to get all athletes vaccinated for COVID19 in order to save Tokyo games

కరోనా దెబ్బకు గత ఏడాది జరగాల్సిన అంతర్జాతీయ క్రీడలన్నీ వాయిదా పడిపోయాయి. అందులో ఒలింపిక్స్ కూడా వున్నాయి. నిరుడు జూన్, జులైలో జరగాల్సిన ఒలింపిక్స్ ఎన్నెన్నో వాయిదాలు పడుతూ వచ్చాయి. చివరకు ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహిస్తున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐవోసీ) ప్రకటించింది. ఆ క్రీడలకు జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యం ఇస్తుంది.

అయితే, అందులో పాల్గొనే క్రీడాకారులందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించాలని ఐవోసీ భావిస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో)తో చర్చలు జరుపుతోంది. అనుకున్న టైం ప్రకారం ఒలింపిక్స్ ను నిర్వహించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే దిక్కు అని ఐవోసీ అంటోంది. వాస్తవానికి జపాన్ లో ఇంకా కరోనా టీకాల పంపిణీ మొదలు కాలేదు. ఫిబ్రవరి చివరి వారం నుంచి పంపిణీ చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, వ్యాక్సిన్ లేకపోయినా సమర్థంగా ఒలింపిక్స్ ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రటరీ కత్సునోబు కాతో చెప్పారు.

కాగా, కరోనా కేసులు పెరుగుతున్నందున ఒలింపిక్స్ ను జపాన్ రద్దు చేసిందని కొన్ని కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీనిపై ఐవోసీ స్పందించింది. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ ను ఈ ఏడాది జూలై 23కు వాయిదా వేశామని, అనుకున్న తేదీ ప్రకారం ఆ రోజే ప్రారంభోత్సవం ఉంటుందని పేర్కొంది. కరోనా నుంచి రక్షణకు కావాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పింది. ఒలింపిక్, పారాఒలింపిక్స్ గేమ్స్ ను దిగ్విజయంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేసింది.