పంత్​ తో నాకు విభేదాలు లేవు: మరో వికెట్​ కీపర్​ వృద్ధిమాన్​ సాహా

23-01-2021 Sat 12:55
  • విఫలమయ్యాను కాబట్టే పంత్ క్ చాన్స్ వచ్చిందని వెల్లడి
  • ఎవరు బాగా ఆడితే వాళ్లకే చోటు దక్కుతుందని వ్యాఖ్య
  • జట్టు ఎంపిక యాజమాన్యం చేతుల్లోనే
No conflicts with Pant says Wridhiman Saha

ప్రస్తుతం టీమిండియాలో వికెట్ కీపర్ ప్లేస్ కోసం పెద్ద పోటీనే ఉంది. బ్యాటింగ్ లో మంచి జోష్ మీదున్న కేఎల్ రాహుల్ ఓ వైపు.. ఈ మధ్యే గబ్బాలో వీరోచిత ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్నందించిన పంత్ మరోవైపు.. కొన్ని మ్యాచ్ లలో చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడిన వృద్ధిమాన్ సాహా ఇంకో వైపు. సాహా, పంత్ ల మధ్య మరింత పోటీ ఉందన్నది విస్పష్టం.  

ఈ నేపథ్యంలోనే రిషబ్ పంత్ పై వృద్ధిమాన్ సాహా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ తో తనకు ఎలాంటి విభేదాలూ లేవని అన్నాడు. జట్టులో ఎవరికి చోటు దక్కినా ఒకరికొకరం సహకరించుకుంటామన్నాడు. తనతో స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయన్నాడు. ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్ అన్న విషయాలను తాను పట్టించుకోనని అన్నాడు. ఎవరు బాగా ఆడితే వాళ్లకే టీమ్ లో చోటు దక్కుతుందని తెలిపాడు.

అవకాశం వచ్చినా రాకపోయినా తన పని తాను చేసుకుంటూ పోతానని అన్నాడు. టీమ్ లో ఎంపిక అన్నది తన చేతుల్లో లేని విషయమని, జట్టు యాజమాన్యమే నిర్ణయిస్తుందని చెప్పాడు. మొదటి తరగతిలోనే ఎవరికీ ఆల్ జీబ్రా బోధించరని అన్నాడు.

పంత్ ఆటను చాలా మెరుగుపరుచుకున్నాడన్నాడు. దీర్ఘకాలంలో అది టీమిండియాకు చాలా మంచి చేస్తుందని అభిప్రాయపడ్డాడు. అతడికి అత్యంత ఇష్టమైన టీ20లు, వన్డేలకు దూరమైన తర్వాత అతడు చూపిన తెగువ ఎనలేనిదని అన్నాడు. తాను విఫలమవ్వడం వల్లే పంత్ మిగతా మూడు టెస్టుల్లో చోటు దక్కించుకున్నాడని, తన నైపుణ్యాలకు పదును పెట్టడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టానని సాహా చెప్పుకొచ్చాడు.