ప్ర‌కాశం జిల్లా ఎస్పీని క‌లిసి లిఖిత పూర్వ‌కంగా ఫిర్యాదు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్

23-01-2021 Sat 12:42
  • ఆత్మ‌హత్య చేసుకున్న జ‌న‌సేన నేత‌ వెంగయ్య  
  • ఆ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన  పవన్ కల్యాణ్, నాదెండ్ల
  • ఇటువంటి చ‌ర్య‌ల‌ను చూస్తూ ఊరుకోబోమ‌న్న ప‌వ‌న్
pawan gives complaint

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జ‌న‌సేన నేత‌ వెంగయ్య నాయుడి కుటుంబాన్ని ఆ పార్టీ అధినేత‌ పవన్ కల్యాణ్, నాదెండ్ల మ‌నోహ‌ర్ ప‌రామ‌ర్శించారు.  గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన అవమానాన్ని త‌ట్టుకోలేకే ఆయ‌న  ఆత్మహత్య చేసుకున్నాడ‌ని జ‌న‌సేన నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ప్రకాశం జిల్లా ఎస్పీని ప‌వ‌న్, నాదెండ్ల క‌లిశారు.
   
 
బాధిత కుటుంబ స‌భ్యులు కూడా ఎస్పీకి వివ‌రాలు తెలిపారు. ఎస్పీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ లిఖిత పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు. కాగా, ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే వారిని తాము వ‌ద‌ల‌బోమ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ హెచ్చ‌రించారు. వెంగయ్య నాయుడితో పాటు ప‌లువురు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను అన్నా రాంబాబు అవ‌మానించార‌ని అన్నారు.

    
గ్రామ సమస్యపై ఎమ్మెల్యేని  ప్ర‌శ్నించినందుకే  ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని చెప్పారు. ఇటువంటి ఘ‌ట‌న‌లు ఎక్కువైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని అన్నారు. ఎమ్మెల్యే పాల్ప‌డ్డ చ‌ర్య‌ల‌కు ఆయ‌న‌ను శిక్షించే ధైర్యం జ‌గ‌న్ కి ఉందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ వైసీపీ నేత‌లు పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారని ఆయ‌న విమర్శించారు. వెంగయ్య మృతి ఆ పార్టీ నేత‌ల‌ పతనానికి దారి తీస్తుంద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై రాస్తే జర్నలిస్టులను కూడా వదలటం లేద‌ని వారిపై కూడా కేసులు పెడుతున్నార‌ని ప‌వ‌న్ తెలిపారు.