Rajnath Singh: లడఖ్ లో బలగాలను తగ్గించం: తేల్చి చెప్పిన రక్షణ మంత్రి రాజ్​ నాథ్​

Wont Reduce Troops At Border Unless China Does Says Rajnath Singh
  • ముందు చైనా తగ్గించాకే ఆ పనిచేస్తామని స్పష్టీకరణ
  • తూర్పు లడఖ్ గొడవ ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని వెల్లడి
  • చైనాకు దీటుగా నిర్మాణాలు చేపడుతున్నామన్న రక్షణ మంత్రి
సరిహద్దుల్లో చైనా తన బలగాలను తగ్గించేంత వరకు తాము బలగాలను తగ్గించబోమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో వేగంగా మౌలిక వసతులను కల్పిస్తున్నామని, అందులో కొన్ని ప్రాజెక్టులపై చైనా అభ్యంతరం చెప్పిందని అన్నారు.

‘‘తూర్పు లడఖ్ లో బలగాలను తగ్గించడం జరిగే పని కాదు. ముందు చైనా తన బలగాలను తగ్గించుకోవాలి. ఆ తర్వాతే మేం చేస్తాం. ప్రస్తుతం జరుగుతున్న గొడవ ఎప్పుడు ముగుస్తుందన్నది మన చేతుల్లో లేదు. ఫలానా తేదీన పరిష్కారం దొరుకుతుందని చెప్పడానికి లేదు. అయితే, చర్చల ద్వారా కచ్చితంగా పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకం మాకుంది’’ అని ఆయన అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ గ్రామంలో చైనా నిర్మాణాలు చేస్తోందన్న దానిపైనా ఆయన మాట్లాడారు. ఆ గ్రామ సరిహద్దుల్లో నిర్మాణాలు చేపట్టిందన్నారు. ఇలాంటి మౌలిక వసతులను చైనా ఎప్పటి నుంచో సరిహద్దుల్లో ఏర్పాటు చేసుకుంటూనే ఉందని చెప్పారు. ఇప్పుడు చైనాకు దీటుగా ఇండియా కూడా వాస్తవాధీన రేఖ వెంబడి నిర్మాణాలు చేపడుతోందన్నారు.

సరిహద్దు గ్రామాల్లోని స్థానికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వారి అభివృద్ధి కోసమే వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చైనాతో సంబంధాలు నాలుగు దశాబ్దాల హీన స్థాయికి చేరాయన్న విదేశాంగ మంత్రి జై శంకర్ వ్యాఖ్యలపైనా రాజ్ నాథ్ స్పందించారు. అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. భారత విశ్వాసాన్ని చైనా కోల్పోయిందన్నారు.

సాగు చట్టాల్లో ప్రతి అంశం వారీగా చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, అవసరం ఉన్న చోట కచ్చితంగా సవరణలు చేస్తామని రాజ్ నాథ్ చెప్పారు. ఇదే విషయాన్ని పదే పదే చెప్పానన్నారు. చట్టాలపై లోతైన చర్చ జరిగేందుకు ఆ మూడు సాగు చట్టాలను 18 నెలల పాటు వాయిదా వేసేందుకూ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు.
Rajnath Singh
Defence Minister
China

More Telugu News