Dinakaran: శశికళను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని కోరిన దినకరన్

  • ప్రస్తుతం విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స 
  • శశికళను పరామర్శించిన దినకరన్
  • అభ్యర్థనను తిరస్కరించిన వైద్యులు
Officers rejects to send Sasikala to private hospital

దివంగత జయలలిత నెచ్చెలి శశికళ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆమె ప్రస్తుతం న్యుమోనియా జ్వరం, తీవ్ర రక్తపోటు తదితర లక్షణాలతో బాధపడుతున్నారు. బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైల్లో ఉన్న ఆమె ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది. ఇంతలోనే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. ఆమె త్వరగా కోలుకుని, క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.

అనారోగ్యం బారిన పడిన శశికళకు తొలుత జైల్లో ఉన్న ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఐసీయూకి తరలించారు. ఆ తర్వాత ఆమె కొంచెం కోలుకున్నట్టు కనిపించినా... ఆ తర్వాత దగ్గు, జ్వరం తీవ్రమయ్యాయి. దీంతో అనుమానం వచ్చి ఆమెను విక్టోరియా ఆసుపత్రికి తరలించి సీటీ స్కాన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. థైరాయిడ్, మధుమేహంతో కూడా ఆమె బాధపడుతున్నట్టు విక్టోరియా వైద్యులు తెలిపారు.

మరోవైపు శశికళను పరామర్శించేందుకు ఏఎంఎంకే అధినేత దినకరన్, కుటుంబ వైద్యుడు వెంకటేశ్, అసిస్టెంట్ కార్తికేయన్ తదితరులు విక్టోరియా ఆసుపత్రి వద్దకు వచ్చారు. అయితే దినకరన్ ను మాత్రమే వైద్యులు లోపలకు అనుమతించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం కోసం బెంగళూరులో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి శశికళను తరలించాలని దినకరన్ కోరారు. అయితే, ఆయన అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు.

More Telugu News