హోసూరు ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దొంగల ముఠా హల్‌చల్.. పట్టపగలే 25 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన వైనం!

23-01-2021 Sat 08:06
  • మాస్కులు, హెల్మెట్లు ధరించిన దుండగులు
  • దోచుకున్న బంగారం విలువ ఏడున్నర కోట్లు
  • నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలతో గాలింపు
Armed gang robs 25kg of gold from Muthoot Finance in Hosur

తమిళనాడు హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దొంగలు పట్టపగలే చెలరేగిపోయారు. కార్యాలయం తలుపులు ఇలా తెరుచుకున్నాయో, లేదో, అలా లోపలికి ప్రవేశించిన ఆరుగురు దుండగులు తుపాకితో బెదిరించి 25 కిలోలకుపైగా బంగారాన్ని ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. హోసూరు-బాగలూరు రోడ్డులో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి మాస్కులు, హెల్మెట్లు ధరించిన ఆరుగురు దుండగులు ప్రవేశించారు. ఆ సమయంలో లోపల ఐదుగురు సిబ్బంది, ముగ్గురు వినియోగదారులు ఉన్నారు.

లోపలికి వచ్చిన దుండగులు తొలుత సెక్యూరిటీ గార్డుపై దాడిచేశారు. ఆ తర్వాత మేనేజర్,  నలుగురు సిబ్బందిని తుపాకితో బెదిరించి రూ. 7.5 కోట్ల విలువైన 25 కేజీలకు పైగా బంగారం, లాకర్లలో ఉన్న 96 వేల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు దుండగులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు కర్ణాటకకు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు మూడు బృందాలను బెంగళూరుకు పంపారు.