కొమిరేపల్లిలో విస్తరిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. నిన్న ఒక్క రోజే 24 మందికి అస్వస్థత

23-01-2021 Sat 07:20
  • భీమడోలులో ఇద్దరు, ఏలూరులో ఇద్దరికి
  • ఎవరికీ ప్రాణాపాయం లేదన్న వైద్యులు
  • సీఎం జగన్ ఆదేశాలతో కొమిరేపల్లికి ఉన్నతాధికారులు
mysterious illness cases spread to another village in komireplle

పశ్చిమ గోదావరి జిల్లాలో అంతుచిక్కని వ్యాధి రోజురోజుకు విస్తరిస్తోంది. వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దెందులూరు మండలం కొమిరేపల్లిలో నిన్న 25 మంది, భీమడోలులో ఇద్దరు, ఏలూరులో ఇద్దరు చొప్పున నిన్న వింతవ్యాధితో ఆసుపత్రిలో చేరారు.

ఇక, ఈ వ్యాధి బారినపడిన వారి సంఖ్య భీమడోలులో 36కు పెరిగింది. నిజానికి కొమిరేపల్లిలో గురువారం నమోదైంది ఒక్క కేసే. కానీ శుక్రవారానికి బాధితుల సంఖ్య ఒక్కసారిగా 25కు పెరిగింది. వీరిలో పురుషులు 16 మంది, మహిళలు 9 మంది ఉన్నారు. 21 మంది వ్యాధి నుంచి కోలుకోగా, నలుగురు ఇంకా చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి  అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని, ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గీతా ప్రసాదిని, మంత్రి ఆళ్ల నాని తదితరులు కొమిరేపల్లి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో రెండు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు, ఏలూరులో తగ్గిందనుకున్న వ్యాధి మళ్లీ వెలుగు చూడడం కలవరపెడుతోంది. నిన్న ఓ బాలిక, మరో వృద్ధుడు ఇవే లక్షణాలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.