Beer Yoga: కాంబోడియాలో బీరు యోగా... ఆసక్తిచూపుతున్న యువత!

Beer Yoga in Cambodia after lock down
  • కాంబోడియాలో లాక్ డౌన్ ఎత్తివేత
  • బీరు సేవిస్తూ యోగా చేస్తున్న యువత
  • ప్రోత్సహిస్తున్న బీరు కంపెనీ
  • సంతోషంగా ఉందంటున్న యువత
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ ప్రజల మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపింది. నెలల తరబడి ఇళ్లకే పరిమితమైన ప్రజలు స్తబ్దతకు లోనయ్యారు. ముఖ్యంగా, యువతకు లాక్ డౌన్ అంటే కాళ్లు, చేతులు కట్టేసినట్టే అయింది. ఆసియా దేశం కాంబోడియాలో లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యువత బీరు తాగుతూ యోగా చేస్తుండడం వాటిలో ముఖ్యమైనది.

కాంబోడియా ముఖ్యనగరం నామ్ ఫెన్ లో యువతకు ఇప్పుడీ యోగా బీర్ బాగా ఉపశమనం కలిగిస్తోంది. నలుగురితో కలిసి హాయిగా బీరు తాగుతూ, యోగా చేయడాన్ని వారు ఆస్వాదిస్తున్నారు. ఈ తరహా యోగాను ప్రముఖ బీరు తయారీ సంస్థ టూబర్డ్స్ క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ ప్రోత్సహిస్తోంది. బీరు యోగాతో తమకు ఎంతో వినోదం లభిస్తోందని స్రేలిన్ బచా అనే పాతికేళ్ల యువతి చెబుతోంది. స్నేహితులతో కలిసి బీరు తాగుతూ యోగా చేయడంతో ఎంతో సంతోషం కలుగుతోందని వివరించింది.

వాస్తవానికి ఇది అచ్చమైన యోగా సాధన కాదని, మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడపడమేనని, యోగాసనాలతో వినోదం అందిపుచ్చుకుంటున్నామని యోగా ఇన్ స్ట్రక్టర్ అన్నా తెలిపారు. ఆసియాలో చిన్నదేశమైన కాంబోడియా కరోనాను అత్యంత సమర్థంగా కట్టడి చేసింది. ఇక్కడ ఇప్పటివరకు 456 కేసులు మాత్రమే రాగా, 399 మంది కోలుకున్నారు. ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఈ దేశంలో కేవలం 6 వారాలు మాత్రమే లాక్ డౌన్ విధించి ఆ తర్వాత సడలించారు.
Beer Yoga
Cambodia
Lock Down
Corona Virus

More Telugu News