లండన్ లో రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో మరణించిన భారత సంతతి మహిళ

22-01-2021 Fri 21:16
  • రోడ్డుపై విగతజీవురాలిగా విమలా మాతై
  • శరీరంపై గాయాలను గుర్తించిన వైద్య సిబ్బంది
  • రోడ్డు ప్రమాదంగా అనుమానం
  • ఆధారాల కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు
  • సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి
Indian origin woman dies in a London road

ఓ భారత సంతతి మహిళ లండన్ లోని రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె పేరు విమలా మాతై. వయసు 61 సంవత్సరాలు. ఉత్తర లండన్ లో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, వైద్య సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. విమలా మాతై శరీరంపై గాయాలను గుర్తించిన వైద్య సిబ్బంది యాక్సిడెంట్ కారణంగా చనిపోయి ఉండొచ్చని అంచనా వేశారు. అయితే, ఆమె రోడ్డుప్రమాదంలోనే చనిపోయిందనడానికి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు.

కాగా, యాక్సిడెంట్ చేసి ఆమె మృతికి కారణమై ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు 27 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారు నడిపి యాక్సిడెంట్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నా, ఆధారాలు లభ్యం కాలేదు. దాంతో, ఈ ఘటనపై సమాచారం అందించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విషాదకరమైన అంశం ఏమిటంటే గురువారం విమలా మాతై పుట్టినరోజు. పుట్టినరోజు జరుపుకోకుండానే ఆమె మరణించడం బాధాకరం!