యూపీలో దొంగల ముఠా నిర్వహిస్తున్న పోలీసులు... నగల దుకాణం లూటీ!

22-01-2021 Fri 21:00
  • దొంగలతో చేతులు కలిపిన పోలీసులు
  • మహరాజ్ గంజ్ లో నగల దుకాణం దోపిడీ
  • రూ.35 లక్షల విలువైన నగల దోపిడీ
  • పోలీసులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
Police involves in a robbery in UP

కంచే చేను మేస్తే అనే సామెతను ఉత్తరప్రదేశ్ లోని పురానీ బస్తీ పోలీసులు నిజం చేశారు. కాపాడాల్సిన పోలీసులే దొంగల అవతారం ఎత్తారు. దొంగలతో చేతులు కలిపి ఏకంగా ఓ నగల దుకాణాన్ని లూటీ చేశారు. రూ.35 లక్షల విలువైన ఆభరణాలను దోచుకుని దొంగలకు తామేమీ తీసిపోమని నిరూపించుకున్నారు. పురానీ బస్తీ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్సై ధర్మేంద్ర యాదవ్, మహేందర్ యాదవ్, సంతోష్ యాదవ్ అనే కానిస్టేబుళ్లు దొంగలతో కలిశారు.

మహరాజ్ గంజ్ ప్రాంతంలో ఉన్న ఓ నగల దుకాణాన్ని టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడ్డారు. అందినకాడికి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా, తమ సహచరులే ఇందులో నిందితులని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఉన్నతాధికారులు ఆ ఎస్సైని, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురే కాదు, మరో 9 మంది పోలీసులకు కూడా ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్నారు. దోపిడీకి వినియోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.