SAAW: స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ ను విజయవంతంగా పరీక్షించిన భారత్

  • ఒడిశాలోని బాలాసోర్ కేంద్రం నుంచి ప్రయోగం
  • హాక్ విమానం నుంచి పరీక్షించిన డీఆర్డీవో
  • లక్ష్యాన్ని ఛేదించిన ఎస్ఏఏడబ్ల్యూ
  • దీని పరిధి 100 కిలోమీటర్లు
  • ప్రత్యర్థి వాయుసేన సన్నద్ధతను దెబ్బతీసే అస్త్రం
India test fires smart anti airfield weapon successfully

భారత్ మరో అస్త్రానికి పదును పెడుతోంది. ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తున్న వేళ, సరికొత్త టెక్నాలజీతో పరిపుష్టమైన స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ (ఎస్ఈఈడబ్ల్యూ)ను ఇవాళ విజయవంతంగా పరీక్షించింది.

ఒడిశా తీరంలో హాక్-ఎంకే132 విమానం నుంచి ప్రయోగించిన ఈ స్మార్ట్ ఆయుధం నిర్దేశిత లక్ష్యాన్ని గురితప్పకుండా ఛేదించింది. డీఆర్డీవో ఇప్పటివరకు నిర్వహించిన 9 పరీక్షల్లోనూ ఈ స్మార్ట్ వెపన్ విజయవంతమైంది. బాలాసోర్ ఇంటెరిమ్ టెస్టింగ్ రేంజ్ లో ఏర్పాటు చేసిన టెలీమెట్రీ, ట్రాకింగ్ వ్యవస్థలు ఈ స్మార్ట్ అస్త్రం ప్రయోగం తీరుతెన్నులను రికార్డు చేశాయి.

ఎస్ఏఏడబ్ల్యూ ప్రధానంగా ప్రత్యర్థి దేశం వాయుసేన సన్నద్ధతను దెబ్బతీసేందుకు నిర్దేశించిన ఆయుధం. దీన్ని హైదరాబాదులోనే అభివృద్ధి చేశారు. దీని డిజైన్, నిర్మాణం హైదరాబాదులోని డీఆర్డీవోకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ లోనే జరిగింది. ఇది 125 కేజీల విభాగానికి చెందిన ఆయుధం. ప్రత్యర్థి వాయుసేనకు చెందిన భూతల స్థావరాలను తుత్తునియలు చేస్తుంది. రాడార్లు, బంకర్లు, టాక్సీ ట్రాక్స్, రన్ వేలను ఇది ధ్వంసం చేస్తుంది.

ఈ స్మార్ట్ అస్త్రం పరిధి 100 కిలోమీటర్లు. ఇదే తరహాలోని ఇతర ఆయుధాల కంటే ఇందులో అత్యంత కచ్చితత్వంతో కూడిన గైడెడ్ బాంబును పొందుపరిచారు. కాగా, గత పరీక్షలో ఈ ఎస్ఏఏడబ్ల్యూని జాగ్వార్ విమానం నుంచి ప్రయోగించారు.

More Telugu News