Centre: ఏం మార్పు లేదు... ముగిసిన కేంద్రం, రైతుల 11వ విడత చర్చలు 

Talks ended between farmers and Union Government
  • జాతీయ వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన 
  • ఈ మధ్యాహ్నం మరో దఫా సమావేశమైన కేంద్రం, రైతులు
  • చట్టాలను రెండేళ్లు నిలిపివేస్తామన్న కేంద్రం
  • ఇంతకంటే మంచి ప్రతిపాదన ఇంకేదీ లేదన్న కేంద్రం
  • చట్టాలు పూర్తిగా తొలగించాల్సిందేనన్న రైతులు
  • ఆందోళనలు తీవ్రతరం చేస్తామని స్పష్టీకరణ
జాతీయ వ్యవసాయ చట్టాలపై కొనసాగుతున్న ప్రతిష్టంభనలో ఏ మార్పు లేదు. కేంద్రం, రైతుల మధ్య 11వ విడత జరిగిన చర్చలు కూడా ఎలాంటి పరిష్కారం చూపకుండానే ముగిశాయి. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారైంది. ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉండడంతో ఇవాళ జరిగిన చర్చలు కూడా ఫలప్రదం కాలేదు.

కాగా, నేటి చర్చల సందర్భంగా ప్రభుత్వం 10వ విడత చర్చల్లో చెప్పిన మాటలనే పునరావృతం చేసిందని రైతు సంఘాలు వెల్లడించాయి. నూతన వ్యవసాయ చట్టాల అమలును కొన్నాళ్ల పాటు ఆపేస్తామని, అంతకంటే మెరుగైన ప్రతిపాదన ఇంకోటి ఉండబోదని ఇవాళ తేల్చి చెప్పిందని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ వెల్లడించారు. రెండేళ్ల పాటు దేశంలో నూతన వ్యవసాయ చట్టాల అమలు నిలుపుదల చేస్తామని, ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తేనే రైతులతో తదుపరి విడత చర్చలు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసిందని అన్నారు.

చర్చల సరళిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందిస్తూ, చర్చలకు రావడం ద్వారా సహకరిస్తున్న రైతు సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ చట్టాల్లో ఎలాంటి లోపాలు లేవని, కానీ రైతుల పట్ల గౌరవంతోనే వాటిని కొన్నాళ్ల పాటు నిలిపివేస్తామని ప్రతిపాదన చేస్తున్నామని వెల్లడించారు. చట్టాల నిలుపుదలపై చర్చిద్దామని రైతులు కోరుకుంటే మరో సమావేశానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.

అయితే రైతులు మాత్రం వ్యవసాయ చట్టాలను పూర్తిగా తొలగించాలన్న తమ పాత డిమాండ్ కే కట్టుబడ్డారు. చట్టాల్లో సవరణలకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం చెప్పినా, రైతు సంఘాల ప్రతినిధులు మెత్తబడలేదు. కేంద్రం వైఖరి ఇదే అయితే, తాము ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ముందు నిర్ణయించిన విధంగా జనవరి 26న భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు.

అటు, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేత ఎస్ఎస్ పంథేర్ మాట్లాడుతూ, చర్చల సందర్భంగా కేంద్రమంత్రి తమను మూడున్నర గంటల సేపు నిరీక్షించేలా చేశారని ఆరోపించారు. రైతులను ఇది తీవ్రంగా అవమానించడమేనని తెలిపారు. వచ్చీ రావడంతోనే, కేంద్రం ప్రతిపాదనను పరిశీలించాలని కోరారని, ఆపై చర్చలు ముగిశాయని పేర్కొన్నారని ఆరోపించారు.
Centre
Farmers
Farm Laws
Talks

More Telugu News