ఎన్టీఆర్ కు విధించిన ట్రాఫిక్ జరిమానాను తాను చెల్లించిన అభిమాని.. ప్రతిఫలంగా ఏం కోరాడో చూడండి!

22-01-2021 Fri 17:50
  • గత నెలలో ఎన్టీఆర్ కు ఓవర్ స్పీడ్ చలాన్
  • ఔటర్ పై వేగంగా వెళ్లినందుకు రూ.1,035 జరిమానా
  • ఇప్పటివరకు చెల్లించని హీరో
  • జరిమానా చెల్లించి ఫొటో పంచుకున్న అభిమాని
  • బదులుగా ఆర్ఆర్ఆర్ టికెట్లు ఇప్పించాలని ఎన్టీఆర్ విజ్ఞప్తి
Fan pays NTR challan for over speed

సినిమా హీరోల బలమంతా అభిమానులే. తమ ఆరాధ్య కథానాయకుల కోసం అభిమానులు ఏమైనా చేసేందుకు సిద్ధపడతారు. ఈ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఓ అడుగు ముందుకేసి తన హీరో చెల్లించాల్సిన డ్రైవింగ్ చలాన్ ను తానే చెల్లించాడు. అందుకు బదులుగా ఆర్ఆర్ఆర్ టికెట్లు ఇప్పించాలని కోరాడు.

కొన్నిరోజుల కిందట జూనియర్ ఎన్టీఆర్ కు ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేశారు. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్లాడంటూ ఎన్టీఆర్ కు రూ.1,035 చలాన్ రాశారు. ఈ జరిమానాను ఎన్టీఆర్ ఇప్పటివరకు చెల్లించలేదు. అయితే, ఓ అభిమాని ఆ జరిమానాను తానే చెల్లించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆధారాలతో సహా వెల్లడించాడు. అంతేకాదు, తనకు, తన ఫ్రెండ్స్ కు మల్లికార్జున, భ్రమరాంభ థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లు ఇప్పించాలని ఎన్టీఆర్ ను కోరాడు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనిపై విపరీతంగా స్పందిస్తున్నారు.