ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వాయిదా... కొత్త తేదీ ప్రకటించనున్న బీసీసీఐ!

22-01-2021 Fri 16:59
  • ఈ వేసవిలో ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు
  • పిభ్రవరి 11న వేలం నిర్వహించాలని భావించిన బీసీసీఐ
  • వాయిదా వేస్తున్నట్టు వెల్లడి
  • ఫిబ్రవరి మూడో వారంలో ఉంటుందన్న బోర్డు వర్గాలు
IPL auction postponed as per reports

భారత క్రికెట్ ప్రేమికులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మళ్లీ వస్తోంది. ఆయా జట్ల ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే ఆటగాళ్ల ఎంపికపై దృష్టి సారించాయి. అక్కర్లేని ఆటగాళ్లను నిర్మొహమాటంగా వదిలించుకుంటున్నాయి.

మరోపక్క, ఐపీఎల్ 14వ సీజన్ కోసం నిర్వహించాల్సిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ వాయిదా పడింది. వాస్తవానికి ఫిబ్రవరి 11న ఐపీఎల్ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమైంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కొనుగోలు కోసం రూ.196 కోట్ల మేర ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ మినీ వేలం ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వేలం ప్రక్రియ ఫిబ్రవరి మూడో వారంలో ఉంటుందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

కాగా, ఆయా ఫ్రాంచైజీలు తాము విడిచిపెట్టిన ఆటగాళ్లతో పాటు, అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను కూడా విడుదల చేశాయి. దాంతో వదిలించుకున్న ఆటగాళ్లను వేలం ప్రక్రియలో అందుబాటులోకి తీసుకువస్తారని తెలుస్తోంది.